IPL 2025 : కర్మఫలం అంటే ఇదేనా.. గత సీజన్‌లో చేసిన తప్పుకు.. ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా పై నిషేదం.. హత విధి..
ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం కాకముందే ముంబై ఇండిన్స్‌కు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి.

Do you konw Why Hardik Pandya banned from the MI first IPL 2025 match
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసింది. భారత్ విజేతగా నిలిచింది. ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ 2025 సీజన్ పై పడింది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ఐపీఎల్ 18వ సీజన్ కోసం సిద్ధం అవుతున్నాయి. ఈ సీజన్ ఇంకా ఆరంభం కాకముందే ముంబై ఇండిన్స్‌కు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ సీజన్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లకు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం కానుండగా, హార్దిక్ పాండ్యా పై నిషేదం అమల్లో ఉండడంతో తొలి మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆఖరి టెస్టు సందర్భంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయానికి గురైయ్యాడు. దీంతో అతడు ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. ఐపీఎల్ ప్రారంభం నాటికి కోలుకుంటాడు అని అంతా భావించారు. అయితే.. అతడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆడే తొలి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్నాయి.
ఏప్రిల్ తొలి వారంలో అతడు ముంబై జట్టుతో కలవనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. ప్రస్తుతం బుమ్రా నెమ్మదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడని, అయితే.. పూర్తి సామర్థ్యంతో బౌలింగ్ చేసేందుకు ఇంకొన్ని రోజుల సమయం పట్టనుందని ఎన్‌సీఏ వర్గాలు చెప్పినట్లు సదరు వార్తల సారాంశం.
పాండ్యా పై అమల్లో ఉన్న నిషేదం..
ఐపీఎల్ 2024 సీజన్‌లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది. పేలవ ప్రదర్శన చేసింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగగా.. 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో టోర్నీని ముగించింది.
అయితే.. ఐపీఎల్ 2024 ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తలపడింది. ఈ మ్యాచ్‌లో ముంబై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేటు(నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయలేకపోవడం) నమోదు చేసింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబైకి ఇది మూడో స్లో ఓవర్ రేటు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఓ సీజన్‌లో మూడు సార్లు స్లో ఓవర్ రేటుకు పాల్పడితే.. ఆ జట్టు కెప్టెన్ పై ఓ మ్యాచ్ నిషేదాన్ని విధిస్తారు. ఈ క్రమంలో పాండ్యా పై ఓ మ్యాచ్ నిషేదం పడింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. దీంతో పాండ్యా మ్యాచ్ నిషేదం అప్పుడు అమలు కాలేదు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇది అమలు కానుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఆడనున్న తొలి మ్యాచ్‌లో పాండ్యా ఆడకూడదు.