విరాట్ కోహ్లీకి భారతరత్న ఇవ్వాలి, బీసీసీఐ ప్రత్యేక రిటైర్మెంట్ మ్యాచ్ నిర్వహించాలి : మాజీ సీఎస్కే ప్లేయర్

భారత క్రికెట్ కు కోహ్లీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న అవార్డును ఇవ్వాలని ..

Virat Kohli

Virat kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 36 ఏళ్ల కోహ్లీ.. తన టెస్ట్ కెరీర్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. 123 మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి.

 

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి మాజీ టీమిండియా ప్లేయర్, మాజీ సీఎస్కే ఆటగాడు సురేష్ రైనా మాట్లాడారు. భారత క్రికెట్ కు కోహ్లీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న అవార్డును ఇవ్వాలని అన్నారు.

 

శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా సురేష్ రైనా మాట్లాడుతూ.. భారత క్రికెట్ కు చేసిన కృషికిగాను విరాట్ కోహ్లీని భారత రత్న అవార్డుతో సత్కరించాలని అన్నారు. అంతేకాదు.. విరాట్ కోహ్లీ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రత్యేక రిటైర్మెంట్ మ్యాచ్ నిర్వహించాలని రైనా బీసీసీఐని కోరారు. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ కుటుంబ సభ్యులు, అతని చిన్ననాటి కోచ్ లను ఆహ్వానించాలని అన్నారు. దేశానికి అంతటి సేవ చేసిన తరువాత అతనితో మాట్లాడి, ఒక రిటైర్మెంట్ మ్యాచ్ ఇవ్వడం అవసరం అని రైనా అభిప్రాయ పడ్డారు.

 

ఇదిలాఉంటే.. మే 17న బెంగళూరులో జరిగిన RCB, KKR మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా.. విరాట్ కోహ్లీ కోసం చిన్నస్వామి స్టేడియంలో అభిమానులు తెల్ల జెర్సీలతో హాజరయ్యారు. 2024 టీ20 వరల్డ్ కప్ తరువాత పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.