Four MI players in contention for India Squad Selection in Asia Cup 2025
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ 2025 జరగనుంది. ఎనిమిది జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరగనుంది.
ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు నిమగ్నమయ్యారు. ఆగస్టు మూడో వారంలో జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఈ జట్టులో ముగ్గురు లేదా నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు స్థానం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
సూర్యకుమార్ యాదవ్..
టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే అతడు స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు. అక్కడ ఫిట్‌నెస్‌ను సాధించే పనిలో ఉన్నాడు. అయితే.. అతడు ఖచ్చితంగా ఆసియా కప్‌లో ఆడతాడనే హామీ మాత్రం ఇంత వరకు రాలేదు. మెగా టోర్నీ లోపు అతడు పూర్తి ఫిట్‌నెస్‌ను అందుకుంటాడా? లేదా అన్నది అనుమానంగా ఉండడమే అందుకు కారణం. ఒక వేళ అతడు ఫిట్‌నెస్ సాధిస్తే.. చోటు ఖాయమే.
MS Dhoni : వచ్చే సీజన్ ఆడతారా..? ఫ్యాన్స్ ప్రశ్నకు ధోని హిలేరియస్ సమాధానం.. వీడియో వైరల్..
హార్దిక్ పాండ్యా..
టీ20ప్రపంచకప్ 2024 విజేతగా టీమ్ఇండియా నిలవడంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆసియాకప్ 2025లో అతడి పై భారీ అంచనాలే ఉన్నాయి. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్‌కు దూరం అయితే మాత్రం టీమ్ఇండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
జస్‌ప్రీత్ బుమ్రా..
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాడు టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా. ఆసియా కప్ తరువాత భారత జట్టుకు తీరిక లేని షెడ్యూల్ ఉంది. ఈ క్రమంలో ఆసియా కప్ 2025కి బుమ్రాకి విశ్రాంతి ఇవ్వొచ్చు. యూఏఈ పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలం కావడం కూడా ఇందుకు ఓ కారణం కావొచ్చు. బుమ్రాకు విశ్రాంతి ఇస్తే సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లు పేస్ భారాన్ని మోయవచ్చు.
తిలక్ వర్మ..
హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ గతకొంతకాలంగా టీమ్ఇండియా టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటూ వస్తున్నాడు. ఎంతో ఒత్తిడిలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటూ మ్యాచ్‌లను ముగిస్తున్నాడు. పేస్, స్పిన్ రెండింటిని సమర్థవంతంగా ఆడడం అతడి అతి పెద్ద బలం. మిడిల్ ఆర్డర్ విభాగంలో అతడు భారత్‌కు కీలక ఆటగాడు.
మరి వీరిలో ఎంత మంది ఆసియా కప్ 2025లో చోటు దక్కించుకుని రాణిస్తారో వేచి చూడాల్సిందే.