Legends League: ఫైనల్ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం.. విజేతగా వరల్డ్ జెయింట్స్‌

లెజెండ్స్ లీగ్ క్రికెట్(LLC) ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో ఆసియా లయన్స్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది.

Cricket League

World Giants vs Asia Lions: లెజెండ్స్ లీగ్ క్రికెట్(LLC) ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో ఆసియా లయన్స్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. తర్వాత ఆసియా లయన్స్ బ్యాటింగ్‌కి దిగి 231 పరుగులు చేసింది. దీంతో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోయారు. ఈ టీ20 మ్యాచ్‌లో 40 ఓవర్లలో మొత్తం 487 పరుగులు నమోదయ్యాయి. సిక్సర్ల సునామీ సృష్టించిన ప్లేయర్లు.. మ్యాచ్‌లో మొత్తం 38 సిక్సర్లు బాదేశారు. వరల్డ్ జెయింట్స్ ఆటగాళ్లు 22సిక్సర్లు, ఆసియా లయన్స్ బ్యాట్స్‌మెన్లు 16 సిక్సర్లు బాదారు.

ఉత్కంఠ మ్యాచ్‌లో..
కెవిన్ పీటర్సన్ వరల్డ్ జెయింట్స్‌కు గట్టి ఆరంభాన్ని అందించాడు. పీటర్సన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. పీటర్సన్ అవుట్ అయిన తర్వాత, కోరీ అండర్సన్ సిక్సర్ల వర్షం కొనసాగించాడు. 43 బంతుల్లో 94 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.

బ్రాడ్ హాడిన్ (37), డారెన్ సమీ (38), అల్బీ మోర్కెల్ (17) చక్కటి సహకారం అందించగా.. వరల్డ్ జెయింట్స్‌ స్కోరు 250 దాటింది. 257 పరుగుల లక్ష్యాన్ని ఛేధనలో ఆసియా లయన్స్‌కు శుభారంభం లభించింది. శ్రీలంక ఆటగాళ్లు తిలకరత్నే దిల్షాన్ (25), సనత్ జయసూర్య (38) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు ఉపల్‌ తరంగ (25), అస్గర్‌ ఆఫ్ఘన్‌ (24), మహ్మద్‌ యూసుఫ్‌ (39), మహ్మద్‌ రఫీక్‌ (22) కూడా తక్కువ బంతుల్లోనే పరుగులు జోడించి జట్టును రెండు వందలకు చేర్చారు. నిర్ణీత ఓవర్‌లో, జట్టు 8 వికెట్ల నష్టానికి 231 పరుగులు మాత్రమే చేయగలిగింది

‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గామోర్నీ మోర్కెల్:
లెజెండ్స్ లీగ్ క్రికెట్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఎంపికయ్యాడు. మొత్తం సిరీస్‌లో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో హీరో కోరీ అండర్సన్. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. వ‌ర‌ల్డ్ జెయింట్స్ బ్యాట‌ర్‌ కోరీ అండ‌ర్స‌న్ విద్వంసం సృష్టించాడు. కేవ‌లం 43 బంతుల్లో 94 ప‌రుగులు సాధించాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి.