Tilak Varma
Tilak Varma : ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. హైదరాబాద్ కుర్రాడు, టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో తిలక్ వర్మ ఆటతీరు పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, ఫైనల్లో పాక్ పై విజయం తరువాత సోమవారం రాత్రి తిలక్ వర్మ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. దీంతో అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.
Also Read: Asia Cup Final : తిలక్ వర్మ భారీ సిక్స్.. గౌతమ్ గంభీర్ రియాక్షన్ చూశారా.. వావ్.. వీడియో వైరల్..
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం వద్దకు క్రీడాభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని తిలక్ వర్మకు ఘన స్వాగతం పలికారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవిలు ఎయిర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున తిలక్ వర్మను రిసీవ్ చేసుకొని, ఘనంగా సత్కరించారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించిన తిలక్ వర్మ పోరాటం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని శివసేనా రెడ్డి అన్నారు.
ఫైనల్లో మ్యాచ్ గెలిచిన తరువాత తిలక్ వర్మ మాట్లాడారు. ఆసియా కప్ ఫైనల్లో తాను క్రీజులోకి అడుగుపెట్టినప్పుడు పాకిస్థాన్ ఆటగాళ్లు అనవసర మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ, నేను వారికి బ్యాటుతోనే జవాబుఇచ్చానని తెలిపాడు. ఇక స్టాండ్స్ లో వందేమాతరం నినాదాలు విని నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. భారత్ మాతాకీ జై అంటూ మ్యాచ్ తరువాత తిలక్ వర్మ పేర్కొన్నారు.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ఓపెనర్లు పర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించారు. ఆ తరువాత కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలం, బుమ్రా అద్భుత బంతులతో మిగిలిన బ్యాటర్లు తక్కువ పరుగులకే వెంటవెంటనే పెలియన్ బాటపట్టారు. 147 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ (5), శుభ్‌మన్ గిల్ (12) స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (69నాటౌట్), సంజూ శాంసన్ (24), శివమ్ దూబె( 33) రాణించడంతో టీమిండియా విజయం సాధించింది.