Hamza Saleem Dar : టీ10లో ప్ర‌పంచ రికార్డు.. 43 బంతుల్లో 193 నాటౌట్‌.. ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు, 24 బంతుల్లో సెంచ‌రీ ఇంకా..

Hamza Saleem Dar-T10 League : టీ10 క్రికెట్‌లో హమ్జా సలీమ్ దార్ అనే ప్లేయ‌ర్ చ‌రిత్ర సృష్టించాడు.

Hamza Saleem Dar

టీ10 క్రికెట్‌లో హమ్జా సలీమ్ దార్ అనే ప్లేయ‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. స్పెయిన్‌లో జ‌రుగుతున్న‌ యూరోపియన్ క్రికెట్ సిరీస్ (ఈసీఎస్‌)లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. అత‌డు కేవ‌లం 43 బంతుల్లోనే 193 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాదు ఒక ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు బాదాడు. ఆ ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్ల‌తో పాటు ఓ ఫోర్ కొట్టి మొత్తం 43 ప‌రుగులు రాబ‌ట్టాడు.

ఈసీఎస్‌లో భాగంగా డిసెంబరు 5న కాటలున్యా జాగ్వార్ (సీజేజీ), సోహల్ హాస్పిటల్‌ (ఎస్ఓహెచ్‌) జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కాటలున్యా జాగ్వార్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జ‌ట్టు నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 257 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు ఇద్ద‌రు నాటౌట్‌గా నిలిచారు. యాసిల్ అలీ 19 బంతుల్లో 58 ప‌రుగులు చేయ‌గా మ‌రో ఓపెన‌ర్ హమ్జా సలీమ్ దార్ పెను విధ్వంస‌మే సృష్టించాడు. కేవ‌లం 43 బంతుల్లో 14 ఫోర్లు, 22 సిక్స‌ర్లు బాది 193 ప‌రుగులు చేశాడు.

IND vs SA : ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌..!

ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు..

ఇన్నింగ్స్ ఆరంభం నుంచి హమ్జా సలీమ్ దార్ సోహల్ హాస్పిటల్‌ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. బౌండ‌రీ వ‌ర్షం కురిపించాడు. బంతి ప‌డితే సిక్స్ లేదంటే ఫోర్ అన్న‌ట్లుగా అత‌డి ఇన్నింగ్స్ సాగింది. ఈ క్ర‌మంలో అత‌డు 24 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఇక తొమ్మిదో ఓవ‌ర్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. మ‌హ‌మ్మ‌ద్ వారిస్ వేసిన ఈ ఓవ‌ర్‌లో ఏకంగా 43 ప‌రుగులు వ‌చ్చాయి. ఈ ఓవ‌ర్‌లో స‌లీమ్ దార్ వ‌రుస‌గా ఆరు సిక్స‌ర్లు బాదాడు. ఈ ఓవ‌ర్‌లో రెండు వైడ్‌లు, ఓ నోబాల్‌తో క‌లిపి మొత్తం 9 బంతులు వేయ‌గా మొద‌టి బంతిని ఫోర్‌గా మ‌లిచిన స‌లీం.. ఆ త‌రువాత వ‌రుస‌గా సిక్స‌ర్లు బాదాడు.

అనంత‌రం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన సోహల్ హాస్పిటల్‌ నిర్ణీత 10 ఓవ‌ర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 104 ప‌రుగుల‌కే పరిమిత‌మైంది. దీంతో 153 ప‌రుగుల భారీ తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. ఆ జ‌ట్టులో ర‌జా షాబాద్ 25, ఖ‌మ‌ర్ షాబాద్ 22, అమీర్ సిద్ధిఖీ 16 ప‌రుగులు చేశారు. ఈ ముగ్గురు మిన‌హా మ‌రే ఇత‌ర బ్యాట‌ర్లు రెండు అంకెల స్కోరు చేయ‌లేదు. కాట‌లోనియా బౌల‌ర్ల‌లో హ‌మ్జా స‌లీమ్ దార్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఫైజల్‌ సర్ఫరాజ్‌, ఫరూఖ్‌ సొహైల్‌, అమీర్‌ హమ్జా, కెప్టెన్‌ ఉమర్‌ వకాస్ త‌లా ఓ వికెట్ తీశారు.

Obstructing The Field : విచిత్ర రీతిలో ఔటైన బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆట‌గాడు.. చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

ట్రెండింగ్ వార్తలు