Hardik Pandya To Lead Team India In Champions Trophy Report
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండాలనే నిర్ణయం సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడి భవిష్యత్తు పై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. రోహిత్ గైర్హజరీలో జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగింది. ఇక టెస్టుల్లో రోహిత్ శర్మ ఆఖరి మ్యాచ్ ఆడేశాడని, సిడ్నీ మ్యాచ్ అనంతరం రిటైర్‌మెంట్ ప్రకటించనున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో కథనం క్రికెట్ అభిమానులో మరో కొత్త చర్చకు దారితీసింది.
వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను బీసీసీఐ తప్పించనుందట. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగించనుందట. హార్దిక్ పాండ్య నాయకత్వంలోనే భారత్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగనుందనేది సదరు వార్తల సారాంశం.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అనంతరం భారత్ ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు పాండ్యను కెప్టెన్ చేసి ఆ తరువాత పూర్తిస్థాయిలో సారథ్య బాధ్యతలు అప్పగించనున్నట్లు సదరు కథానాలు పేర్కొన్నాయి. అప్పుడు హార్దిక్ సారథ్యంలో రోహిత్ ఆడాల్సిన పరిస్థితులు ఏర్పడాయి. మరి అప్పుడు రోహిత్ శర్మ జట్టులో ఆటగాడిగా కొనసాగుతాడా? లేదంటే టెస్టులో పాటు వన్డేలకు వీడ్కోలు పలుకుతాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హిట్‌మ్యాన్ టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థానంలో హార్దిక్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో హార్దిక్ నాయకత్వంలోనే రోహిత్ శర్మ ఆడాడు. అయితే.. ఈ సీజన్‌లో హార్దిక్ సారధ్యంలోని ముంబై జట్టు ఘోర ప్రదర్శన చేసింది. 14 మ్యాచులు ఆడగా 4 మ్యాచుల్లోనే విజయం సాధించింది. 10 మ్యాచుల్లో ఓడిపోయింది. 8 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఒకవేళ హార్దిక్ కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తే టీమ్ఇండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి హైబ్రిడ్ మోడల్‌లో ప్రారంభమవుతుంది. కరాచీలో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది.