Harmanpreet Kaur comments after India women lost match to South Africa Women
Harmanpreet Kaur : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ తొలి ఓటమి రుచి చూసింది. వరుసగా శ్రీలంక, పాకిస్తాన్ పై విజయాలను అందుకున్న భారత్ గురువారం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్ (94; 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో శతకాన్ని కోల్పోయింది. ప్రతీకా రావల్ (37), స్నేహ్ రాణా (33)లు రాణించారు. స్మృతి మంధాన (23) పర్వాలేదనిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (9), జెమిమా రోడ్రిగ్స్ (0), దీప్తి శర్మ (4) లు ఘోరంగా విఫలం అయ్యారు. సఫారీ బౌలర్లలో క్లోయ్ ట్రయాన్ మూడు వికెట్లు పడగొట్టారు. మారిజానే కప్ప్, నాడిన్ డి క్లెర్క్, నోంకులులేకో మ్లాబాలు తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం 252 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలో దక్షిణాఫ్రికా ఘోరంగా తడబడింది. గత మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన తజ్మిన్ బ్రిట్స్ డకౌట్ కగా.. లుజ్ (5), మారిజానే కప్ప్(20), అనెకె బోష్ (1), సినాలో జాఫ్టా (14) లు విఫలం కావడంతో 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్లో ట్రైయాన్ (49; 66 బంతుల్లో 5 ఫోర్లు) రాణించగా.. నదైన్ డిక్లెర్క్ (84 నాటౌట్; 54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని అందుకుంది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా లు చెరో రెండు వికెట్లు తీశారు.
మ్యాచ్ అనంతరం ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించింది. తమ కంటే దక్షిణాప్రికా బ్యాటర్లు మెరుగ్గా బ్యాటింగ్ చేశారని, విజయానికి వారు అర్హులని అంది. తాము ఇంకా మెరుగు అవ్వాల్సి ఉందని చెప్పుకొచ్చింది.
‘ఇది చాలా కఠినమైన మ్యాచ్. నిజం చెప్పాలంటే రెండు జట్లు అద్భుతంగా ఆడాయి. మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలినప్పటికి కూడా 250 పరుగులు చేయడం బాగుంది. అయితే.. సపారీ బ్యాటర్లు కోయ్, డిక్లెర్క్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం అన్న విషయాన్ని వారు చూపించారు. వారు మా కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. విజయానికి వారు పూర్తిగా అర్హులు.’ అని హర్మన్ అంది.
భారత టాప్ స్కోరర్‌గా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ గురించి మాట్లాడుతూ.. ఆమె ఎల్లప్పుడూ అత్యుత్తమంగా ఆడుతుందన్నారు. మ్యాచ్‌ను మలుపు తిప్పగల వ్యక్తి అని కొనియాడారు. ఈ రోజు ఆమె ఆడిన విధానం, హిట్టింగ్ సామర్థ్యానికి తాము చాలా సంతోషించామని చెప్పారు. అలవోకగా సిక్సర్లు కొట్టగలదని, ఈ టోర్నీ ఆసాంతం ఆమె ఇదే జోరును కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
‘ఈ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ బాధ్యతలను తీసుకోలేదు. చాలా వికెట్లను కోల్పోయాం. మేము మా బ్యాటింగ్ తీరును మార్చుకోవాల్సి ఉంది. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోతున్నాము. ఈ వైఫల్యాల నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే గత మ్యాచ్‌ల్లోనూ మేము ఇదే తప్పులను చేశాము. భారీ స్కోరు సాధించేందుకు ఏం చేయాలనే దానిపై ఓ జట్టుగా కూర్చుని మాట్లాడుకోవాలి.’ అని హర్మన్ తెలిపింది.
Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బ్రేక్..
ఇక ఇది సుదీర్ఘమైన టోర్నమెంట్ అని చెప్పింది. ఈ రోజు తమకు కలిసి రాలేదంది. మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా చాలా సానుకూల అంశాలు ఉన్నాయంది. రానున్న మ్యాచ్‌లు చాలా ముఖ్యం. ఈ క్రమంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని హర్మన్ తెలిపింది.