Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. కాగా.. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నైకు ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండగా, నెట్‌రన్‌రేట్ -1.302 గా ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
సన్‌రైజర్స్ పై ఓడిపోవడంతో చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. దాదాపుగా రేసు నుంచి నిష్ర్కమించినట్లే. అయినప్పటికి టెక్నికల్ గా ఇంకా ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు ఛాన్స్ ఉంది. చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే కింది విధంగా జరగాల్సి ఉంటుంది.
మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో గెలవాలి
ఈ సీజన్‌లో చెన్నై మరో 5 మ్యాచ్‌లు ఆడనుంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న మ్యాచుల్లో సీఎస్‌కే తప్పకుండా విజయం సాధించాలి. అప్పుడు చెన్నై ఖాతాలో 14 పాయింట్లు వచ్చి చేరుతాయి.
వాస్తవానికి గత సీజన్లను పరిశీలిస్తే.. 14 పాయింట్లు సాధించిన జట్లు ఖచ్చితంగా ప్లేఆఫ్స్ కు చేరుకుంటాయని చెప్పలేని పరిస్థితి. కానీ ఇతర సమీకరణాలు కలిసి వస్తే మాత్రం 14 పాయింట్లతో గత సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు ఉన్నాయి.
ఏ సమీకరణాలు కలిసి రావాలంటే?
ముందుగా సీఎస్‌కే అన్ని మ్యాచ్‌లు గెలవాలి. అదే సమయంలో కేకేఆర్, సన్‌రైజర్స్ మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం రెండు నుంచి మూడు మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఓడిపోవాలి. అటు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ సైతం సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి.
ఇంక ముంబై, ఆర్‌సీబీ జట్లు తొందరగా 16 పాయింట్లను చేరుకోవద్దు. అప్పుడు చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో మధ్యలోకి రావొచ్చు. అప్పుడు చాలా జట్లు14 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకంగా మారుతుంది. మెరుగైన నెట్‌రన్‌రేట్‌ను సీఎస్‌కే కలిగి ఉంటే చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకోవచ్చు.
కాగా.. ప్రస్తుతం సీఎస్‌కే నెట్‌రన్‌రేట్ అధ్వానంగా ఉంది. కాబట్టి మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే మామూలుగా గెలిస్తే సరిపోదు. భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడే నెట్‌రన్‌రేట్ మెరుగు అవుతుంది. ప్రస్తుతం సీఎస్‌కే ఆడుతున్న తీరు చూస్తుంటే ఇది సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ సీఎస్‌కే వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా మిగిలిన ఇన్ని సమీకరణాలు కలిసి రావాలంటే మాత్రం ఏదైన మహాద్భుతం జరగాల్సిందే.