CSK vs SRH : సన్‌రైజర్స్ పై ఓటమి.. చెన్నై కెప్టెన్ ధోని కామెంట్స్ వైరల్.. ‘మేం ఓడిపోవడానికి కారణం అదే..’
సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోవడంపై చెన్నై కెప్టెన్ ధోని స్పందించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కథ మారలేదు. మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేరుకోవడం కష్టమే. మిగిలిన జట్ల సమీకరణాలు కూడా కలిసి రావాలి. టెక్నికల్‌గా మాత్రమే సీఎస్‌కే ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. దాదాపుగా ఈ సీజన్‌లో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే.
ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 19.5 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. సీఎస్‌కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (42; 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు)టాప్ స్కోరర్. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీశాడు. కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షమీ, కమిందు మెండీస్ తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం ఇషాన్ కిషన్ (44; 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కమిందు మెండిస్ (32 నాటౌట్; 22 బంతుల్లో 3 ఫోర్లు) రాణించడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు.
బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓడిపోయామని చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. మరో 15 నుంచి 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పాడు.
ఓ దశలో చెన్నై స్కోరు 13 ఓవర్లకు 114/4 గా ఉంది. అయితే.. చివరి ఆరు వికెట్లను 40 పరుగుల తేడాతో కోల్పోయింది. దీంతో భారీ స్కోరు సాధించే అవకాశాన్ని కోల్పోయింది. దీని గురించి మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘మేము వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉన్నాము. 155 పరుగుల స్కోరు సరిపోదు. ఎందుకంటే పిచ్ మరీ టర్నింగ్ వికెట్ కాదు. కాబట్టి ఈ స్కోరు సరిపోదు. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది. 15 నుంచి 20 పరుగులను తక్కువగా చేశాము.’ అని ధోని అన్నాడు.
‘డెవాల్డ్ బ్రెవిస్ చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇంకా బాధ్యత తీసుకుని ఆడాల్సి ఉంది. స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాల్సి ఉంది. కానీ మేము అలా చేయలేకపోయాం. ఎప్పుడు కూడా 180 నుంచి 200 పరుగులు చేయాలని చెప్పడం లేదు గానీ, పరిస్థితులను కాస్త అంచనా వేసి అందుకు తగినట్లుగా ఆడాలి.’ అని ధోని తెలిపాడు.
‘మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా సిన్నర్లు సరైన ప్రాంతాల్లో బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఇలాంటి టోర్నమెంట్లలో ఎప్పటికప్పుడు తప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగాలి. జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లు రాణించకుంటే అది చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు తప్పకుండా జట్టులో మార్పులు చేయాల్సి వస్తుంది. ఒకవేళ జట్టు విజయాలు సాధిస్తుంటే.. బాగా రాణించని ఆటగాళ్లకు మరికొన్ని అవకాశాలు ఇవ్వొచ్చు. అయితే.. 4 నలుగురు ఒకేసారి రాణించకుంటే మాత్రం అప్పుడు వాళ్లను కొనసాగించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఆట ఎంతో మారిపోయింది.’ అని ధోని అన్నాడు.