వ‌రుణ దేవా ఎంత ప‌ని జేస్తివి.. ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజ‌రాత్ ఔట్‌.. ఆర్‌సీబీకి ప్లస్సా, మైనస్సా?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ స‌మ‌రం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

PIC Credit : IPL

IPL 2024 Playoff Race : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ స‌మ‌రం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇప్ప‌టికే రేసు నుంచి ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్ త‌ప్పుకోగా తాజాగా ఆ జాబితాలో గుజ‌రాత్ టైటాన్స్ వ‌చ్చి చేరింది. సోమ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రగాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో గుజ‌రాత్ ఇంటి ముఖం ప‌ట్టింది. వ‌ర్షం కార‌ణంగా ఒక్క బంతి కూడా ప‌డ‌లేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేసి కోల్‌క‌తా, గుజ‌రాత్ ల‌కు ఒక్కొ పాయింట్ కేటాయించారు. కేకేఆర్ మిన‌హా మ‌రే జ‌ట్టు కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్‌లో చోటు ద‌క్కించుకోలేదు.

ఇక 16 పాయింట్ల‌తో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ ప్లే ఆఫ్స్‌కు అడుగుదూరంలో నిలిచింది. రెండు మ్యాచుల్లో క‌నీసం ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా ఎలాంటి స‌మీక‌ర‌ణం లేకుండా ఆర్ఆర్‌ జ‌ట్టు ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్‌, స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు పోటీప‌డుతున్నాయి.

ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్‌సీబీ 13 మ్యాచులు ఆడింది. ఆరు మ్యాచుల్లో గెలిచింది. 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. ఆ జ‌ట్టు నెట్‌ర‌న్‌రేటు +0.387గా ఉంది. త‌న చివ‌రి మ్యాచ్‌ను చెన్నైతో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొద‌ట బ్యాటింగ్ చేస్తే సీఎస్‌కేను 18 ప‌రుగుల తేడాతో ఓడించాలి. లేదా చెన్నై ల‌క్ష్యాన్ని నిర్దేశిస్తే దాన్ని 18.1 ఓవ‌ర్ల‌లోనే అందుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సీఎస్‌కే కంటే మెరుగైన నెట్‌ర‌న్ సాధించి ప్లే ఆఫ్స్ లో అడుగుపెడుతోంది. అదే స‌మ‌యంలో ఎస్ఆర్‌హెచ్‌, ల‌క్నో జ‌ట్లు త‌మ చివ‌రి రెండు మ్యాచుల్లో క‌నీసం ఒక్క‌టి అయినా ఓడిపోవాల్సి ఉంటుంది.

అటు చెన్నై ఆర్‌సీబీ పై విజ‌యం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. అదే స‌మ‌యంలో ఎస్ఆర్‌హెచ్‌, లక్నో జ‌ట్లు త‌మ ఆఖ‌రి రెండు మ్యాచుల్లో క‌నీసం ఒక్క‌టి అయినా ఓడిపోవాల్సి ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ?
12 మ్యాచుల్లో ఏడు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉంది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ లో అడుగుపెడుతుంది. అదే స‌మ‌యంలో ల‌క్నో గ‌నుక త‌మ చివ‌రి రెండు మ్యాచుల్లో గెలిచి, చెన్నై ఆఖ‌రి మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే.. అన్ని జ‌ట్లు 16 పాయింట్ల‌తో ఉంటాయి. అప్పుడు నెట్‌ర‌న్‌రేటు కీల‌క పాత్ర పోషిస్తుంది. కాబ‌ట్టి ఎస్ఆర్ఎస్ మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిచి నెట్ ర‌న్ రేటును మెరుగుప‌ర‌చుకోవాల్సి ఉంది.

Also Read: చెన్నైలో ధోనికి గుడి క‌డ‌తారు.. అంబ‌టి రాయుడు వ్యాఖ్య‌లు వైర‌ల్‌

కీల‌క మ్యాచ్‌..
ఢిల్లీ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు నేడు (మే 14న‌) త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇరు జ‌ట్లు చెరో 12 పాయింట్ల‌తో ఉన్నాయి. ఢిల్లీకి ఇదే ఆఖ‌రి మ్యాచ్ కాగా.. ల‌క్నో మ‌రో మ్యాచ్ ముంబైతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సిందే. అదే గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్స్ వెళ్లేందుకు కొంచెం ఛాన్సుంది. అప్పుడు ఎస్ఆర్‌హెచ్‌, చెన్నైలు త‌మ మిగిలిన మ్యాచుల్లో ఓడిపోవాలి. అప్పుడు నెట్‌ర‌న్ మెరుగ్గా ఉన్న జ‌ట్లుకు అవ‌కాశం ఉంది. అటు ల‌క్నో ప‌రిస్థితి అలాగే ఉంది. ఢిల్లీ, ముంబై జ‌ట్ల‌ను ఓడించాల్సి ఉంది. అదే స‌మ‌యంలో సీఎస్‌కే, స‌న్‌రైజ‌ర్స్ మిగిలిన మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంది.

Also Read : ఏంటి చిన్నా ఇదీ.. అంత మంది క‌ళ్లు గ‌ప్పి తీసుకుపోగ‌ల‌వా చెప్పు.. బాల్‌ను దొంగిలించే ప్ర‌య‌త్నం చేసిన ఫ్యాన్‌!

వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో గుజ‌రాత్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించింది. ఆఖ‌రి మ్యాచులో గెలిచినా కూడా ఆ జ‌ట్టు ఖాతాలో 13 పాయింట్లే ఉంటాయి. ఇప్ప‌టికే నాలుగు జ‌ట్లు 14 పాయింట్లు క‌లిగి ఉన్నాయి. ఆర్‌సీబీ చివ‌రి మ్యాచ్‌లో గెలిస్తే ఆ జ‌ట్టు ఖాతాలో 14 పాయింట్లు వ‌చ్చి చేర‌తాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న అన్ని జ‌ట్ల‌కు వ‌ర్షం వ‌ల్ల గుజ‌రాత్ వ‌ర్సెస్ కేకేఆర్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ర‌ద్దు కావ‌డం క‌లిసొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు