IND vs SA : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో టీమ్ఇండియా విజ‌యానికి 5 ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..

ఎట్ట‌కేల‌కు భార‌త్ మ‌రోసారి విశ్వవిజేత‌గా నిలిచింది.

ఎట్ట‌కేల‌కు భార‌త్ మ‌రోసారి విశ్వవిజేత‌గా నిలిచింది. బార్బ‌డోస్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచులో 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 17 ఏళ్ల త‌రువాత రెండో సారి టీ20 ఛాంపియన్‌గా భార‌త జ‌ట్టు నిలిచింది. ఈ మ్యాచ్‌లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. రోహిత్ (9), రిష‌బ్ పంత్ (0), సూర్య‌కుమార్ యాద‌వ్ (3) లు విఫ‌లం కావ‌డంతో భార‌త్ 34 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

ఈ ద‌శ‌లో జ‌ట్టును న‌డిపించే బాధ్య‌త‌ల‌ను సీనియ‌ర్ ఆట‌గాడు విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) త‌న భుజాన వేసుకున్నాడు. ఆల్‌రౌండ‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్ (47; 31 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు), శివ‌మ్ దూబె (27; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌)ల‌తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పాడు. దీంతో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది.

అనంత‌రం క్లాసెన్ (52), క్వింటన్ డికాక్ (39), ట్రిస్టన్ స్టబ్స్ (31) లు రాణించ‌డంతో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించేలా క‌నిపించింది. స‌ఫారీల విజ‌యానికి ఆఖ‌రి 5 ఓవ‌ర్ల‌లో 30 ప‌రుగులే కావాల్సి ఉంది. క్రీజులో దంచికొడుతున్న క్లాసెన్‌తో పాటు మిల్ల‌ర్ ఉండ‌డంతో భార‌త విజ‌యం క‌ష్ట‌మేన‌ని అనిపించింది. ఇక్క‌డి నుంచి భార‌త బౌల‌ర్లు అద్భుత‌మే చేశారు. కేవ‌లం 22 ప‌రుగులే ఇచ్చిన నాలుగు వికెట్లు తీశారు. అనూహ్య మ‌లుపులు తిరిగిన మ్యాచుల్లో ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డానికి సాయ‌ప‌డిన 5 పాయింట్లు ఇవే..

బుమ్రా ఆఖ‌రి స్పెల్‌..
ఆఖ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌య స‌మీక‌ర‌ణం 30 బంతుల్లో 30 ప‌రుగులుగా ఉంది. ఈ ద‌శ‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ.. బుమ్రా చేతికి బంతిని ఇచ్చాడు. కెప్టెన్ త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ 16వ ఓవ‌ర్‌ను వేసిన బుమ్రా కేవ‌లం నాలుగు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. ఆ త‌రువాత 18వ ఓవ‌ర్‌లో జాన్సెన్ వికెట్ తీయ‌డంతో పాటు కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి విజయంతో కీల‌క పాత్ర పోషించాడు.

సూర్య‌కుమార్ యాద‌వ్ స్ట‌న్నింగ్ క్యాచ్..
ఆఖ‌రి ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు చేస్తే ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించేదే. హార్దిక్ పాండ్య బౌలింగ్ కు వ‌చ్చాడు. తొలి బంతిని ఆడిన డేవిడ్ మిల్ల‌ర్ భారీ షాట్ కొట్టాడు. అయితే.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద సూర్య‌కుమార్ యాద‌వ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఒక‌వేళ సూర్య గ‌నుక ఈ క్యాచ్‌ను ప‌ట్ట‌క‌పోయి ఉంటే ఆ బంతి సిక్స్‌గా వెళ్లేది. ఆ త‌రువాత ఏం జ‌రిగేదే ఊహించుకోవ‌చ్చు.

Rohit Sharma Emotions : నెర‌వేరిన క‌ల‌.. ప్ర‌పంచ‌క‌ప్ సాధించ‌గానే రోహిత్ శ‌ర్మ నేల‌పై ప‌డుకుని..

అక్ష‌ర్ ప‌టేల్‌ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌..
ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ టీమ్ఇండియా రెండో సారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడంలో కీల‌క పాత్ర పోషించిన వారిలో ఒక‌డు. 34 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన భార‌త్‌ను కోహ్లితో క‌లిసి పోటీలోకి తీసుకువ‌చ్చాడు. 31 బంతుల్లో 1 ఫోర్‌, నాలుగు సిక్స‌ర్లు బాది 47 ప‌రుగులు చేసి తృటిలో హాఫ్ సెంచ‌రీని కోల్పోయాడు. కోహ్లితో క‌లిసి నాలుగో వికెట్‌కు కీల‌క‌మైన 72 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఇక బౌలింగ్‌లో దూకుడుగా ఆడుతున్న ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌ను ఔట్ చేశాడు.

విరాట్ హాఫ్ సెంచ‌రీ..
ఫైన‌ల్ మ్యాచ్ ముందు వ‌ర‌కు ఫామ్ లేమీతో ఇబ్బంది ప‌డ్డాడు విరాట్ కోహ్లి. అయితే.. ఫైన‌ల్ మ్యాచులో మాత్రం అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కీల‌క స‌మ‌యంలో ఫామ్‌లోకి వ‌చ్చిన అత‌డు అక్ష‌ర్ ప‌టేల్‌, శివ‌మ్ దూబెల‌తో క‌లిసి మంచి భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు. జ‌ట్టు స్కోరును 170కి పైగా తీసుకువెళ్లాడు. ఈ మ్యాచ్‌లో 59 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 6 ఫోర్లు, 2 సిక్సర్ల‌తో 76 ప‌రుగులు చేశాడు.

హార్దిక్ పాండ్యా కీలక స్పెల్
స్పిన్న‌ర్లు అక్షర్ పటేల్ (1/49), కుల్దీప్ యాదవ్ (0/45) భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డంతో హార్దిక్ చేతికి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బంతిని అందించాడు. త‌న ఆల్‌రౌండ‌ర్ పాత్ర‌కు న్యాయం చేస్తూ బౌలింగ్‌లో చెల‌రేగిపోయాడు ఈ రైట్ ఆర్మ్ పేసర్. మొద‌ట హెన్రిచ్ క్లాసన్ ఔట్ చేశాడు. ఆ త‌రువాత ఆఖ‌రి ఓవ‌ర్‌లో 16 ప‌రుగుల‌ను డిఫెండ్ చేస్తూ ప్ర‌మాద‌క‌ర డేవిడ్ మిల్ల‌ర్‌తో పాటు క‌గిసో ర‌బాడ‌ల‌ను పెవిలియ‌న్‌కు చేర్చాడు. మూడు ఓవ‌ర్ల‌ను వేసిన హార్దిక్‌ 20 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Rohit-Virat : విజ‌యంతో టీ20ల‌కు రోహిత్ శ‌ర్మ‌, కోహ్లి వీడ్కోలు.. ఇంత‌కంటే మంచి స‌మ‌యం ఉండ‌దంటూ..

దీంతో భార‌త్ 17 ఏళ్ల సుదీర్ఘ విరామం త‌రువాత రెండో సారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకుంది.

ట్రెండింగ్ వార్తలు