ODI World Cup 2023 : ప్ర‌పంచ క‌ప్‌లో సెమీస్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే..?

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 జ‌ర‌గ‌నుంది. మ‌రి ఎన్ని మ్యాచుల్లో గెలిస్తే టీమ్‌లు సెమీస్‌కు చేరుకుంటాయి అన్న విష‌యాల‌ను ఇప్పుడు చూద్దాం..

PIC @ ICC twitter

ODI World Cup : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 జ‌ర‌గ‌నుంది. మ‌రో మూడు రోజుల్లో ఈ మెగా స‌మ‌రం ఆరంభం కానుంది. మొత్తం 10 జ‌ట్లు క‌ప్పు కోసం పోటీ ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. రౌండ్ రాబిన్ ప‌ద్ద‌తిలో లీగ్ స్టేజ్ జ‌ర‌గ‌నుంది. ఒక్కొ జ‌ట్టు మిగిలిన 9 జ‌ట్ల‌తో ఒక్కొ మ్యాచ్ ఆడుతుంది. మ‌రి ఎన్ని మ్యాచుల్లో గెలిస్తే టీమ్‌లు సెమీస్‌కు చేరుకుంటాయి అన్న విష‌యాల‌ను ఇప్పుడు చూద్దాం..

టాప్‌-4 జ‌ట్లు సెమీస్‌లోకి..
రౌండ్ రాబిన్ ప‌ద్ద‌తిలో లీగ్ స్టేజీలో మొత్తం 45 మ్యాచులు జ‌రుగుతాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి నాలుగు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి, నాలుగో స్థానంలో నిలిచిన జ‌ట్లు, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీఫైన‌ల్స్‌లో త‌ల‌ప‌డ‌తాయి. ఈ రెండు సెమీఫైన‌ల్‌లో విజ‌యం సాధించిన జ‌ట్లు ఫైన‌ల్‌కు చేరుకుంటాయి. న‌వంబ‌ర్ 19న ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

సెమీస్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెల‌వాలంటే..?
లీగ్ ద‌శ‌లో ప్ర‌తీ జ‌ట్టు 9 మ్యాచులు ఆడ‌నుంది. 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను ఓ సారి ప‌రిశీలిస్తే.. అప్పుడు కూడా ఇదే విధానంలో మ్యాచులు జ‌రగాయి. అప్పుడు 7 మ్యాచుల్లో గెలిచిన జ‌ట్లు సెమీఫైన‌ల్‌కు చేరుకున్నాయి. టీమ్ఇండియా, ఆస్ట్రేలియాలు 9 మ్యాచుల్లో 7 మ్యాచుల్లో గెలిచి సెమీస్ బెర్తుల‌ను ఖాయం చేసుకుని టాప్‌-2లో నిలిచాయి. ఆరు మ్యాచుల్లో గెలిచినా స‌రే సెమీఫైన‌ల్‌కు చేరుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

పాయింట్లు స‌మం అయితే..?
రెండు జ‌ట్ల పాయింట్లు కూడా స‌మం అయితే.. అప్పుడు నెట్ ర‌న్‌రేట్ కీల‌కం కానుంది. నెట్‌ర‌న్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న జ‌ట్టు ముందుకు వెలుతుంది. 2019 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్‌ను ఇలాగే వెన‌క్కి నెట్టి న్యూజిలాండ్ సెమీ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించింది. అప్పుడు కివీస్‌, పాక్‌లు 11 పాయింట్ల‌తో స‌మంగా నిల‌వ‌గా, నెట్ రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ ముందడుగు వేసింది.

Also Read: టీమ్ఇండియాతో తిరువ‌నంత‌పురం వెళ్ల‌ని కోహ్లీ..! ముంబైకి ఎందుకు వెళ్లాడు..?

సెమీస్ ఛాన్స్ ఎవ‌రికంటే..?
మొత్తం 10 జ‌ట్లు ప్ర‌పంచ‌క‌ప్ కోసం పోటీప‌డనున్నాయి. అయితే.. క్రికెట్ పండితుల అంచ‌నాల ప్ర‌కారం ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్‌కు చేరే జ‌ట్లు ఇవే. అతిథ్య భార‌త్‌తో పాటు డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా పాకిస్తాన్‌లు సెమీస్‌కు చేరుకుంటాయ‌ని అంచనా వేస్తున్నారు. అయితే.. ద‌క్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జ‌ట్ల‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీలు లేద‌న్న సంగ‌తి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు