Women’s World Cup Prize Money : డబ్బే.. డబ్బే.. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025.. భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎంతో తెలిస్తే షాకే..

సెప్టెంబర్‌ 30 నుంచి భారత్ వేదికగా ఈ మొగా టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు బరిలోకి దిగనున్నాయి.

Women’s World Cup Prize Money : డబ్బే.. డబ్బే.. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025.. భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎంతో తెలిస్తే షాకే..

Updated On : September 2, 2025 / 10:58 AM IST

ICC: 13వ ఎడిషన్ ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కు సంబంధించి ఐసీసీ చారిత్రక నిర్ణయం తీసుకుంది. భారీ ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది. ఈసారి ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రికార్డ్ స్థాయిలో రూ.122 కోట్లుగా ఖరారు చేసింది. 2022లో న్యూజిలాండ్ వేదిక‌గా జరిగిన వ‌న్డే వరల్డ్ కప్ తో పోలిస్తే ఈ ప్రైజ్‌మనీ 300 శాతం అధికం కావ‌డం గ‌మ‌నార్హం. అప్పుడు ప్రైజ్ మనీ 30 కోట్లే. అంతేకాదు.. ఇది 2023 మెన్స్‌ వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కంటే కూడా చాలా ఎక్కువ. ఆ మెగా టోర్నీకి ఐసీసీ రూ.88 కోట్లు కేటాయించింది.

13వ ఎడిషన్ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 విజేత‌కు 40 కోట్లు ప్రైజ్ మనీ అంద‌నుంది. ఇది 2022 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ విజేత ఆస్ట్రేలియా అందుకున్న దానికంటే 239 శాతం ఎక్కువ. ఆ స‌మ‌యంలో ఆసీస్ కేవ‌లం రూ. 11 కోట్లు మాత్ర‌మే నగదు బ‌హుమ‌తిగా అందుకుంది. ఇక ర‌న్న‌ర‌ప్‌గా నిలిచే జట్టుకు సుమారు రూ. 19 కోట్లు అందుతాయి. సెమీ ఫైన‌లిస్ట్‌లు ఒక్కొక్కరికి సుమారు రూ. 9 కోట్లు ద‌క్క‌నుంది.

ఇక గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు రూ. 30 లక్షలు నగదు బహుమతి అందనుంది. 5, 6 స్ధానాల్లో నిలిచే జ‌ట్లకు 6 కోట్లు.. 7, 8 స్ధానాల్లో నిలిచే జ‌ట్ల‌కు 2.5 కోట్లు ప్రైజ్ మనీగా లభించనుంది.

2023లో మెన్స్‌ వన్డే వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా రూ.33.31 కోట్ల ప్రైజ్‌మనీ అందుకోగా.. రన్నరప్‌ భారత్‌కు రూ.16.65 కోట్లు దక్కాయి. మహిళల వన్డే ప్రపంచ కప్ విజేత మొత్తం దీని కంటే చాలా ఎక్కువ. ఉమెన్స్‌ క్రికెట్‌కు సైతం ప్రజాదరణ కల్పించడంతో పాటు పురుషులతో పాటు సమానంగా గౌరవం ఇవ్వడమే ప్రైజ్‌మనీ భారీగా పెంచడం వెనుక ప్రధాన ఉద్దేశం అని ఐసీసీ తెలిపింది.

”4 రెట్లు ప్రైజ్ మనీ పెంపు ప్రకటన మహిళల క్రికెట్ ప్రయాణంలో ఒక మైలురాయి. మహిళల క్రికెట్ దీర్ఘకాలిక వృద్ధికి మా స్పష్టమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా సందేశం చాలా సులభం. మహిళలు ఈ క్రీడను వృత్తిపరంగా ఎంచుకుంటే పురుషులతో సమానంగా గౌరవం, అవకాశాలు లభిస్తాయనే నమ్మకం వారిలో కలగాలి” అని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు.

సెప్టెంబర్‌ 30 నుంచి భారత్ వేదికగా ఈ మొగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్‌ 2తో ముగుస్తుంది. పాకిస్థాన్ జట్టు తన మ్యాచులను శ్రీలంక వేదికగా ఆడనుంది. ఈ 13వ ఎడిషన్‌లో మొత్తం 8 జట్లు బరిలోకి దిగనున్నాయి. భారత్‌లోని గౌహతి, ఇండోర్, ముంబై, విశాఖపట్నం.. శ్రీలంక కొలంబోలోని ఐదు వేదికల్లో మ్యాచులు జరుగుతాయి.

Also Read: మెగా టోర్నీ నుంచి త‌ప్పుకున్న తిల‌క్ వ‌ర్మ‌..