ICC Champions Trophy: పాక్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ.. ఛాంపియన్స్ ట్రోపీలో భార‌త్ ఆడే మ్యాచ్‌ల‌న్నీ అక్క‌డే..!

ఐసీసీ చైర్మన్ జైషా, బోర్డు సభ్యుల మధ్య గురువారం అనధికార సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ..

ICC Champions Trophy 2025

ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోపీ వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చిలో పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే, భారత్ జట్టు పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోపీలో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైబ్రిడ్ విధానంలో టోర్నీలో పాల్గొనేందుకు బీసీసీఐ ఓకే చెప్పింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందుకు తొలుత ఒప్పుకోకపోయినా.. ఐసీసీ సూచనతో వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో ఐసీసీ ముందు పాకిస్థాన్ రెండు డిమాండ్లను ఉంచింది. తాజాగా.. పాకిస్థాన్ డిమాండ్ల ప్రస్తావన లేకుండానే ఛాంపియన్స్ ట్రోపీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు ఐసీసీ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. తద్వారా ఈ ట్రోఫీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి.

Also Read: AUS-W vs IND-W : భార‌త్‌కు షాక్‌.. తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం..

ఐసీసీ చైర్మన్ జైషా, బోర్డు సభ్యుల మధ్య గురువారం అనధికార సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ క్రికెట్ బోర్డు డిమాండ్ ప్రకారం.. రాబోయే కాలంలో భారత్ ఆధిత్యమిచ్చే టోర్నీల్లో పాకిస్థాన్ జట్టుకూడా హైబ్రిడ్ పద్దతిలో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని ఐసీసీని డిమాండ్ చేసింది. ఐసీసీ పాక్ డిమాండ్ ను సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది అక్టోబర్ లో మహిళల వన్డే ప్రపంచ కప్ కు భారత్ అతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీలో పాక్ మ్యాచ్ లు భారత్ వెలుపల జరిగే అవకాశం ఉంది. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ ను శ్రీలంకతో కలిసి ఉమ్మడిగా భారత్ నిర్వహించనుంది. ఇందులో పాకిస్థాన్ మ్యాచ్ లకు శ్రీలంక వేదికగా ఉండే ఆస్కారముంది. మరోవైపు ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా పెంచాలని ఐసీసీని పాక్ క్రికెట్ బోర్డు కోరింది. అంటే.. ఐసీసీ బోర్డు ఆదాయాలలో పీసీబీకి వాటాను పెంచాలని డిమాండ్ చేసింది. అయితే, పీసీబీకి ఎలాంటి అదనపు పరిహారాన్ని ఇచ్చేందుకు ఐసీసీ సానుకూలంగా లేదని తెలుస్తోంది.

Also Read: IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రోహిత్ శ‌ర్మ భారీ త్యాగం.. ఇప్పుడెలా..!

ఐసీసీ తాజా నిర్ణయంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ సహా మొత్తం 15 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఒకవేళ భారత జట్టు ఫైనల్ కు చేరకపోతే.. లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ జట్టు ఫైనల్స్ కు చేరితే ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబర్ 7వ తేదీన ఐసీసీ సమావేశం అధికారికంగా జరగనుంది. ఈ సమావేశంలో టోర్నీకి సంబంధించిన షెడ్యూల్, తదితర విషయాలపై పూర్తిస్థాయిలో చర్చించి ఐసీసీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.