ICC Champions Trophy 2025 official anthem out now
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 8 దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఆయా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ తమ జట్లను ప్రకటించాయి. ఫిబ్రవరి 12లోగా జట్లలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడడంతో ఐసీసీ ప్రమోషల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అధికారిక గీతాన్ని విడుదల చేసింది. “జీతో బాజీ ఖేల్ కే” అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటను పాకిస్థానీ సింగర్ అతిఫ్ అస్లాం పాడారు.
కరాచీ, లాహోర్, రావల్పిండి మూడు వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే స్టేడియాల ఆధునీకరణ పూర్తి కావొచ్చింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. భద్రతాకారణాల దృష్ట్యా భారత జట్టు పాకిస్థాన్ వెళ్లడం లేదు. ఈనేపథ్యంలో భారత్ ఆడే మ్యాచ్‌లు అన్ని దుబాయ్ వేదికగా జరగనున్నాయి.
The wait is over! 🎉
Sing along to the official song of the #ChampionsTrophy, Jeeto Baazi Khel Ke, featuring the master of melody @itsaadee 🎶🏆 pic.twitter.com/KzwwylN8ki
— ICC (@ICC) February 7, 2025
ఈ టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న ఆడనుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది. ఇక గ్రూప్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో మార్చి 2న ఆడనుంది.
ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరో రెండు సార్లు విజేతలుగా నిలిచి విజయవంతమైన జట్లుగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. నాటి ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. దాదాపు 8 ఏళ్ల తరువాత ఈ టోర్నీ జరుగుతుండడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. గతంలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.