SL vs AUS : పాంటింగ్‌ను వ‌ద‌ల‌ని స్టీవ్ స్మిత్.. మ‌రో రికార్డు బ్రేక్‌.. ఉప‌ఖండంలో ఒకే ఒక ఆసీస్ ఆట‌గాడు..

టెస్టుల్లో పాంటింగ్ రికార్డుల‌పై క‌న్నేశాడు స్టీవ్ స్మిత్.

SL vs AUS : పాంటింగ్‌ను వ‌ద‌ల‌ని స్టీవ్ స్మిత్.. మ‌రో రికార్డు బ్రేక్‌.. ఉప‌ఖండంలో ఒకే ఒక ఆసీస్ ఆట‌గాడు..

Steve Smith becomes Australia leading Test run-scorer in Asia

Updated On : February 7, 2025 / 2:58 PM IST

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఆసియా ఉప‌ఖండంలో టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆస్ట్రేలియా ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. గాలె వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట‌లో 27 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద స్మిత్ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.

ఉప‌ఖండంలో టెస్టుల్లో పాంటింగ్ 48 ఇన్నింగ్స్‌ల్లో 41.97 స‌గ‌టుతో 1889 ప‌రుగులు చేశాడు. అయితే.. స్మిత్ మాత్రం 42 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించ‌డం విశేషం. స్మిత్ స‌గ‌టు ఆసియాలో 51.08గా ఉంది.

అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ఆసీస్ ఆట‌గాడిగా..

అంత‌క‌ముందు ఫీల్డింగ్‌లో టెస్టుల్లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ఆసీస్ ఆట‌గాడిగా స్టీవ్ స్మిత్ నిలిచాడు. ఈ క్ర‌మంలో రికీ పాంటింగ్ రికార్డునే బ్రేక్ చేయ‌డం విశేషం. పాంటింగ్ 287 ఇన్నింగ్స్‌ల్లో 196 క్యాచ్‌లు అందుకోగా స్మిత్ కేవ‌లం 205 ఇన్నింగ్స్‌ల్లో 197 ఈ క్యాచ్‌ల‌ను అందుకున్నాడు. ఇక వీరిద్ద‌రి త‌రువాత స్థానంలో మార్క్ వా 181 క్యాచ్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఓవ‌రాల్‌గా టెస్టుల్లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న రికార్డు టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు రాహుల్ ద్ర‌విడ్ పేరిట ఉంది. ద్ర‌విడ్ 286 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 210 అందుకున్నాడు.

IND vs ENG : శ్రేయ‌స్ అయ్య‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు.. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు.. స‌చిన్, కోహ్లీలకు సాధ్యం కాలేదు..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక మొద‌ట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 257 ప‌రుగుల‌కు ఆలౌటైంది. లంక బ్యాట‌ర్ల‌లో కుశాల్ మెండీస్ (85 నాటౌట్‌), దినేశ్ చండీమాల్ (74) లు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, నాథ‌న్ లియోన్ లు త‌లా మూడు వికెట్లు తీశాడు. ట్రావిస్ హెడ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 49 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసింది. అలెక్స్ కేరీ (49), స్టీవ్ స్మిత్ (74) క్రీజులో ఉన్నారు. మార్న‌స్ ల‌బుషేన్ (4) విఫ‌లం కాగా.. ట్రావిస్ హెడ్ (21), ఉస్మాన్ ఖ‌వాజా (36)లు ఫ‌ర్వాలేద‌నింపించారు. లంక బౌల‌ర్ల‌లో నిషాన్ పీరిస్ రెండు వికెట్లు తీయ‌గా ప్ర‌భాత్ జ‌య‌సూర్య ఓ వికెట్ సాధించాడు. ఆస్ట్రేలియా ఇంకా 64 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

SAT20 : మార్‌క్ర‌మ్ మామనా.. మ‌జాకానా.. ఆనందంలో కాప్య పాప‌.. ముచ్చటగా మూడోసారి..

తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.