Virat Kohli
Virat Kohli – Anushka Sharma: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అదరగొడుతుంది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు తొమ్మిది మ్యాచ్ లలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఓటమి లేకుండా సెమీస్ లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆదివారం భారత్ తన చివరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో 160 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ వేశారు. విరాట్ కోహ్లీ మూడు ఓవర్లు వేసి 13 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. విరాట్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి ఎడ్వర్ట్ (17) ని ఔట్ చేశాడు. బంతి లెగ్ స్టంప్ కిందికి వెళ్లింది. కీపర్ కేఎల్ రాహుల్ ఎడ్వర్ట్స్ అవుట్ సైడ్ ఎడ్జ్ లో షార్ప్ క్యాచ్ అందుకున్నాడు. అంపైర్ ఔట్ ఇవ్వటంతో ప్రేక్షకుల కేరింతలతో స్టేడియం మారుమోగిపోయింది. ఈ క్రమంలో స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కోహ్లీ వన్డేల్లో తొమ్మిది సంవత్సరాల తరువాత వికెట్ తీశాడు. కోహ్లీ బౌలింగ్ వేస్తున్న సమయంలో కోహ్లీ.. కోహ్లీ అంటూ స్టేడియం మొత్తం కోహ్లీ నామస్మరణతో మారుమోగిపోయింది. ఇక వికెట్ తీయడంతో ప్రేక్షకులతో పాటు అనుష్క శర్మ ఆనందంతో కేరింతలు కొట్టింది. అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఇది తొమ్మిదో వికెట్. వన్డేల్లో ఐదు వికెట్లు, టీ20 ల్లో నాలుగు వికెట్లు తీయడం విశేషం.
కోహ్లీ బౌలింగ్ రికార్డును చూస్తే..
టెస్టుల్లో 29.1 ఓవర్లు వేసిన విరాట్ కోహ్లీకి ఒక్క వికెట్ కూడా లభించలేదు. వన్డేల్లో 110.2 ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీశాడు. అందులో 2011 సంవత్సరంలో రెండు వికెట్లు, 2013, 2014లో ఒక్కో వికెట్ లభించాయి. వన్డేల్లో తొమ్మిదేళ్ల తరువాత మళ్లీ నెదర్లాండ్స్ పై జరిగిన మ్యాచ్ లో కోహ్లీ వికెట్ తీశాడు. టీ20 ఫార్మాట్ లో కోహ్లీ 25.2 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అందులో 2011లో రెండు వికెట్లు, 2012, 2016 సంవత్సరాల్లో ఒక్కో వికెట్ ఉన్నాయి.