Asia Cup 2025
Asia Cup 2025 : ఆసియా కప్ -2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్ జట్టు ఓవరాక్షన్ చేసింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అనేక నిబంధనలు ఉల్లంఘించింది. దీంతో ఆ జట్టుపై చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సిద్ధమవుతోంది.
యూఏఈ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో టాస్‌కు ముందు జరిగిన ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (పీఎంఓఏ) మీటింగ్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘనలను పేర్కొంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ అధికారిక ఈ-మెయిల్ పంపింది.
మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాప్ట్, పాకిస్థాన్ కోచ్ మైక్ హెసన్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘాల మధ్య సమావేశాన్ని పాకిస్థాన్ మీడియా మేనేజర్ నయీమ్ గిలానీ వీడియో తీయడంపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి సమావేశాలకు వీడియో మేనేజర్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. పైక్రాప్ట్ క్షమాపణ చెప్పాడని పీసీబీ పేర్కొనడాన్ని కూడా ఐసీసీ తప్పు పట్టింది.
పాకిస్థాన్ ఆటగాళ్లు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాప్ట్‌తో సంభాషణను చూపించే వీడియోను పీసీబీ విడుదల చేసింది. ఆదివారం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా జరిగిన కరచాలన సంఘటన చుట్టూ ఉన్న అపార్థానికి ఆండీ పైక్రాప్ట్ క్షమాపణలు చెప్పారంటూ ఆ వీడియోలో పాకిస్థాన్ పేర్కొంది. అయితే, నిషేధిత ప్రాంతాల్లో వీడియో చిత్రీకరణ, సున్నితమైన సంభాషణలను బహిరంగం చేయడం ప్రవర్తనా నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్ జట్టుపై చర్యలకు ఐసీసీ సిద్ధమవుతోందని తెలిస్తుంది.
🚨 ACTION AGAINST PAKISTAN 🚨
– ICC mulling to take action against Pakistan for violation of multiple rules ahead of the Asia Cup match against UAE. [Kushan Sarkar from PTI]
An E-Mail has been sent by ICC CEO to PCB. pic.twitter.com/f8pjA43j3A
— Johns. (@CricCrazyJohns) September 18, 2025
ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా పాకిస్థాన్ కిక్రెట్ బోర్డును ఉద్దేశించి మాట్లాడుతూ.. మ్యాచ్ రోజున పదేపదే పీఎంఓఏ ఉల్లంఘనలను ఎత్తి చూపారు. అనేక హెచ్చరికలు ఉన్నప్పటికీ పాకిస్థాన్ వారి మీడియా మేనేజర్‌ను టాస్‌కు ముందు పైక్రాప్ట్, ప్రధాన కోచ్ మైక్ హెసన్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మధ్య జరిగిన సమావేశాన్ని చిత్రీకరించడానికి అనుమతించింది. ఇది ఐసీసీ నిబంధనల ప్రకారం కచ్చితంగా నిషేదించిన అంశం. మీడియా మేనేజర్లు అటువంటి చర్చలకు హాజరు కావడానికి అనుమతి లేదు. అలాగే పీఎంవోఏ లోపల వీడియో తీయడం కూడా నేరం అని పేర్కొన్నారు.