ICC World Test Championship: బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి ఐసీసీ వరల్డ్ చాంపియన్ షిప్ కు చేరువయింది టీమిండియా. నాగపూర్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ తేడాతో ఆసీస్ జట్టుపై టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించి మూడు రోజుల్లోనే మ్యాచ్ ను రోహిత్ సేన ముగించింది. నాలుగు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో వరల్డ్ చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
నాగపూర్ టెస్ట్ లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఆస్ట్రేలియా.. వరల్డ్ చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టాప్ లోనే ఉంది. ఇప్పటివరకు 6 సిరీస్ లు ఆడిన ఆసీస్ 10 విజయాలతో 136 పాయింట్లు, 78.83 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా కూడా 6 సిరీస్ లు ఆడి 9 విజయాలతో 111 పాయింట్లు, 61.67 శాతంతో సెకండ్ ప్లేస్ లో ఉంది. శ్రీలంక(53.33), దక్షిణాఫ్రికా(48.72), ఇంగ్లండ్(46.97) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read: విరాట్ కోహ్లి పఠాన్ డ్యాన్స్.. జడేజా కూడా జతకలిశాడు.. భలే చేశారే
వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాకు మరో విజయం అవసరం. టీమిండియాకు ఇంకా ఫైనల్ బెర్త్ ఖరారు కాలేదు. ఈ టోర్నిలో మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు గెలిస్తే భారత్ ఫైనల్ కు చేరుతుంది. గత వరల్డ్ చాంపియన్ షిప్ లో టీమిండియా రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారైనా వరల్డ్ చాంపియన్ షిప్ టైటిల్ సాధించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.