Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (101; 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీ చేయడంతో సోమవారం ఆర్ఆర్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది.
శుభ్‌మన్ గిల్ (84; 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (50 నాటౌట్; 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో మొదట గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు యశస్వి జైస్వాల్ (70 నాటౌట్; 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని రాజస్థాన్ 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా అందుకుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన రాజస్థాన్‌కు ఇది మూడో విజయం కాగా.. 9 మ్యాచ్‌ల్లో గుజరాత్‌కిది మూడో ఓటమి.
సంజూ శాంసన్ వస్తే..
రాజస్థాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో అతడు పక్కటెముల గాయానికి గురైయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.
దీంతో తాత్కాలిక కెప్టెన్‌గా రియాన్ పరాగ్ వ్యవహరిస్తున్నాడు. సంజూ శాంసన్ ఓపెనింగ్ స్థానంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆర్ఆర్ తుది జట్టులోకి తీసుకుంది. లక్నోతో మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన ఈ కుర్రాడు మంచి ప్రదర్శనే చేశాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు.
కాగా.. రాజస్థాన్ రాయల్స్ మే 1న సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సంజూ శాంసన్ అందుబాటులోకి వస్తే ఆర్ఆర్ మేనేజ్‌మెంట్‌కు తుది జట్టు ఎంపికలో తలనొప్పి తప్పకపోవచ్చు. సంజూ స్థానంలో ఆడుతూ మూడో మ్యాచ్‌లోనే శతకం చేసిన సూర్యవంశీని పక్కన బెడుతుందా? లేదా అన్నది ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.
అయితే.. సంజూ ఓపెనర్‌గానే కాకుండా మిడిల్ ఆర్డర్‌లోనూ బ్యాటింగ్ చేయగలడు. ముంబైతో మ్యాచ్‌లో అతడు అందుబాటులోకి వస్తే.. ఓపెనర్‌గా సూర్యవంశీని కొనసాగిస్తూనే మిడిల్ ఆర్డర్‌లో సంజూ బ్యాటింగ్ చేయొచ్చు. అయితే.. ఎవరి స్థానంలో సంజూని ఆడించాలన్నదే ఇప్పుడు ఆర్ఆర్ ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఒకవేళ సంజూ గాయం నుంచి కోలుకోకపోతే అప్పుడు ఎలాంటి తలనొప్పి ఉండదు. గుజరాత్‌తో ఆడిన జట్టుతోనే ఆర్ఆర్ ముందుకు వెళ్లనుంది.