Impossible for anyone to break Yuvraj fastest T20 fifty record says Abhishek Sharma
Abhishek Sharma : గౌహతి వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పెను విధ్వంసం సృష్టించాడు. 20 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్లుగా రికార్డులకు ఎక్కాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రికార్డు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. టీ20 ప్రపంచకప్ 2007లో ఇంగ్లాండ్ పై యువీ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
కాగా.. యువీ రికార్డు గురించి మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడాడు. ఆ రికార్డును బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం అని చెప్పాడు. అయితే.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాత్రం చెప్పలేనని అన్నాడు. ఇక తన నుంచి జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తుంది విధ్వంసకర బ్యాటింగే అని తెలిపాడు. అయితే.. ప్రతిసారి ఇలా ఆడడం సాధ్యం కాదన్నాడు. దూకుడుగా ఆడడం అనేది పూర్తిగా మానసిక స్థితి, సహచర ఆటగాళ్ల నుంచి లభించే మద్దతుపై ఆధారపడి ఉంటుందన్నాడు.
ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఇంకా సరదాగా సాగుతాయని చెప్పుకొచ్చాడు. ఫీల్డ్ పేస్‌మెంట్ ఆధారంగానే తాను షాట్లు ఆడతానని తెలిపాడు. లెగ్ సైడ్ మాత్రమే కాదని గ్యాప్ దొరికితే ఆఫ్ సైడ్ కూడా షాట్లు ఆడతానని అన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గ్లెన్ ఫిలిప్స్ (48), మార్క్ చాప్‌మన్ (32) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు,రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్య లు చెరో రెండు, హర్షిత్ రాణా ఓ వికెట్ తీశాడు.
ఆ తరువాత అభిషేక్ శర్మ (68 నాటౌట్; 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ (57 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడడంతో 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది.