IND vs AUS 1st ODI Sunil Gavaskar Slams DLS Method
Sunil Gavaskar : డక్‌వర్త్ లూయిస్ పద్దతిపై (DLS) టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో ఓవర్ల సంఖ్యను 26కు కుదించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఆ తరువాత డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆసీస్ లక్ష్యాన్ని 131 పరుగులుగా నిర్దేశించారు. ఇదే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. భారత్ చేసిన పరుగుల కంటే ఆసీస్‌కు మరో 5 పరుగుల తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించడమే అందుకు కారణం. ఇక ఈ లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ క్రమంలో డక్‌వర్త్ లూయిస్ పద్దతి పై సునీల్ గవాస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. చాలా మందికి ఈ పద్దతి ఏంటో అర్థం కావడం లేదన్నాడు. అలా ఎలా లక్ష్యాలను నిర్దేశిస్తారో తెలియడం లేదన్నారు. అయినప్పటికి కూడా చాలా కాలంగా ఈ పద్దతి క్రికెట్‌లో వాడుతున్నారన్నాడు.
‘మ్యాచ్‌లకు ఆటంకాలు కలిగిన సమయంలో ఉపయోగించడం కోసం గతంలో ఓ భారతీయుడు VJD (వి. జయదేవన్ మెథడ్)మెథడ్‌ను ప్రవేశపెట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ దీనిని ఉపయోగించింది. అయితే.. ఇప్పుడు ఉపయోగిస్తుందో లేదో తెలియదు.’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఏదీ ఏమైనప్పటి కూడా వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగినపుడు ఇరుజట్లకు సమన్యాయం జరిగేలా ఉండే పద్ధతులను వాడితే బాగుంటుందన్నారు. లక్ష్యం నిర్దేశించేందుకు ప్రామాణికం ఏమిటో ఇరు జట్లకు వివరించాల్సి ఉంటుందని అన్నాడు.
రోహిత్, కోహ్లీ విఫలం కావడం పై..
తొలి వన్డే మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ మిగిలిన మ్యాచ్‌ల్లో వారు బాగా రాణిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
IND vs AUS : అతడిని ఎందుకు దాస్తున్నారు.. ఎక్స్‌పోజ్ చేయండి.. బుమ్రా లేనప్పుడైనా..
‘టీమ్ఇండియా చాలా మంచి జట్టు. నాలుగైదు నెలల క్రితమే ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఇక రోహిత్, కోహ్లీలు రానున్న మ్యాచ్‌ల్లో పెద్ద స్కోర్లు చేస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. చాలా కాలం తరువాత వారు మైదానంలో అడుగుపెట్టారు. నెట్స్‌లో త్రోడౌన్స్ ఆడారు. వాళ్లిద్దరు ఫామ్‌లోకి వస్తే.. భారత్ ఈజీగా 300 నుంచి 320 పరుగులు చేస్తుంది.’ అని గవాస్కర్ అన్నారు.