IND VS BAN
తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాగగా, రెండో, మూడో రోజు ఆట రద్దు అయిన సంగతి తెలిసిందే. రెండు రోజులే మిగిలి ఉండడంతో మ్యాచ్ డ్రా అవుతుందని చాలా మంది భావించారు. అయితే.. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా అద్భుతం చేస్తోంది. నాలుగో రోజు పూర్తిగా ఆట సాగడంతో బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేయడంతో పాటు ఆ జట్టు స్కోరును అధిగమించి 52 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అంతేనా నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది.
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ పట్టుబిగింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 233 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ కు కీలకమైన 52 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు నష్టపోయి 26 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్ హక్ (0), షాద్మాన్ ఇస్లాం (7) లు క్రీజులో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు బంగ్లా ఇంకా 26 పరుగులు వెనుకబడి ఉంది.
ఓవర్ నైట్ స్కోరు 107/3 తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 126 పరుగులు జోడించి మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల ధాటికి ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి మరో వైపు మోమినుల్ హక్ (107 నాటౌట్) తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. భారత ఫీల్డర్ల తప్పిదాలు కూడా అతడికి కలిసి వచ్చాయి. మొత్తంగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగిలిన వారు విఫలం కావడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 74.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీశాడు, సిరాజ్, అశ్విన్, ఆకాశ్ దీప్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. జడేజా ఓ వికెట్ సాధించాడు.
దంచికొట్టిన భారత్..
బంగ్లాదేశ్ ఆలౌట్ అయిన తరువాత తొలి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన భారత్ దూకుడుగా ఆడింది. తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి జైస్వాల్, తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి రోహిత్ శర్మ టీమ్ఇండియా ఉద్దేశ్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు బాది 23 పరుగులు చేసిన రోహిత్ శర్మ మరో భారీ షాట్‌కు యత్నించి మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రోహిత్ ఔటైన బంగ్లాదేశ్ సంతోషించడానికి ఏమీ లేకుండా పోయింది. మరో ఓపెనర్ వైపు యశస్వి జైస్వాల్ (72; 51 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. అతడికి శుభ్‌మన్ గిల్ (39; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) చక్కని సహకారం అందించాడు. రిషబ్ పంత్ (9) విఫలం అయినా విరాట్ కోహ్లీ (47; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (68; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. రోజు చివరిలో బంగ్లాను రెండో ఇన్నింగ్స్ ఆడించి సాధ్యమైనన్ని వికెట్లు పడగొట్టాలని భావించిన రోహిత్ 285/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.