IND vs ENG 4th T20 Saqib Mahmood pick Three wickets in his first over
పూణే వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ ఆరాటపడుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది.
ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూశాంసన్‌లు క్రీజులోకి వచ్చారు. ఆర్చర్ మొదటి ఓవర్ ను వేయగా చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్‌గా మలిచాడు అభిషేక్ శర్మ. అయితే.. రెండో ఓవర్‌లో భారత్‌కు ఏకంగా మూడు షాక్‌లు తగిలాయి. రెండో ఓవర్‌ను సాకిబ్ మహమూద్ వేశాడు. ఈ సిరీస్‌లో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సంజూ శాంసన్ (1) మరోసారి నిరాశపరిచాడు. రెండో ఓవర్ తొలి బంతికి బ్రైడన్ కార్సే క్యాచ్ అందుకోవడంతో సంజూ పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 12 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తరువాత వన్‌డౌన్‌లో వచ్చిన.. భీకర ఫామ్‌లో ఉన్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే జోఫ్రా ఆర్చర్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో సాకిబ్ మహమూద్ హ్యాట్రిక్ తీసే ఛాన్స్ వచ్చింది. అయితే.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఈ ఓవర్‌లోని ఆఖరి బంతికి ఔట్ అయ్యాడు. నాలుగు బంతులు ఆడిన సూర్య ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు వెళ్లాడు. దీంతో భారత్ రెండో ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
పవర్ ప్లే ముగిసే సరికి భారత్ స్కోరు 6 ఓవర్లకు 47/3. అభిషేక్ శర్మ (24), రింకూ సింగ్(20) లు క్రీజులో ఉన్నారు.
అంతకముందు భారత జట్టు తుది జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగింది. పేసర్ మహ్మద్ షమీతో పాటు వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ లను తప్పించారు. వీరి స్థానాల్లో అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్, శివమ్ దూబే జట్టులోకి వచ్చారు. పిచ్ కండిషన్స్, టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేవాడు.
మూడో టీ20 మ్యాచ్‌కి తుది జట్లు ఇవే..
తుది జట్లు:
భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ
సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ.
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్(కీపర్),చ బెన్ డక్కెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, జాకోబ్ బెతెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహముద్.