SL vs PAK : బాబర్ ఆజామ్‌కు ఇదే లాస్ట్ మ్యాచ్? సల్మాన్ కెప్టెన్సీ గోవిందా?
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శనివారం కొలంబో వేదికగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల (SL vs PAK) మధ్య మ్యాచ్ జరగనుంది.
T20 World Cup 2026 SL vs PAK is it Babar Azam last t20 match in international cricket
- శనివారం శ్రీలంకతో పాకిస్థాన్ మ్యాచ్
- అంతర్జాతీయ టీ20 క్రికెట్లో బాబర్ కు చివరి మ్యాచ్ అయ్యే అవకాశం
- సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీకి ముప్పు
SL vs PAK : టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన తరువాత పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ టోర్నీలో పాక్ జట్టు ఫైనల్ చేరుకున్నా, చేరుకోకపోయినా, కప్పు గెలిచినా, గెలవకపోయినా కూడా సల్మాన్ అలీ అఘాను పాక్ కెప్టెన్సీ నుంచి తొలగించాలనే నిర్ణయానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వచ్చిందని సమాచారం. అంతేకాదండోయ్ పలువురు సీనియర్ ఆటగాళ్లకు కూడా ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కానుందని అంటున్నారు.
పీటీఐ నివేదిక ప్రకారం.. టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ ప్రదర్శన పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అసంతృప్తిగా ఉన్నారు. ఈ మెగాటోర్నీ కన్నా ముందు పాక్ జట్టు.. ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతుందని, సెలక్టర్లు, అధికారులు ఆయకు హామీ ఇచ్చారట. అయితే.. అనుకున్న విధంగా పాక్ రాణించకపోవడంతో నఖ్వీ సంతోషంగా లేడని, ఈ క్రమంలోనే ప్రపంచకప్ ముగిసిన వెంటనే సల్మాన్‌ను టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
మెగాటోర్నీ ముగిసిన వెంటనే కొంతమంది సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు గురించి ఆయన.. ప్రధాన కోచ్ మైక్ హెస్సన్, సెలెక్టర్లతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. సల్మాన్, బాబర్ అజామ్, ఉస్మాన్ ఖాన్‌లతో పాటు మరికొందరు సీనియర్ ఆటగాళ్లు అంతర్జాతీయ టీ20 కెరీర్ ఇంతటిలో ముగియనుందని పేర్కొంటున్నారు.
సల్మాన్ అలీ స్థానంలో షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందే ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ ప్రపంచ కప్ తర్వాత యువ ఆటగాళ్లను తీసుకురావాల్సిన అవసరం గురించి నఖ్వీతో మాట్లాడారని తెలుస్తోంది. టీ20 ఫార్మాట్లలో దూకుడైన యువ ఆటగాళ్లకు స్థానం కల్పించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మార్పులు తప్పవని అంటున్నారు.
పాక్ తరుపున 145 మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజామ్‌కు శ్రీలంకతో శనివారం జరిగే మ్యాచే అంతర్జాతీయ క్రికెట్లో చివరి టీ20 మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్థాన్ జట్టు లంక పై భారీ తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధిస్తే మాత్రం మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని అంటున్నారు. కాగా.. టీ20 ప్రపంచకప్ 2026లో బాబర్ ఆజామ్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు.
