IND vs ENG 4th T20 Saqib Mahmood storms into history books
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-1తో కోల్పోయింది. పూణే వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయిన ఆ జట్టు పేసర్ సాకిబ్ మహమూద్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు.
ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన అతడు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ను వేసిన సాకిబ్ మహమూద్ వేశాడు. తొలి బంతికి సంజూ శాంసన్(1)ను ఔట్ చేశాడు. రెండో బంతికి భీకర ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ (0)ను గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. కాగా.. హ్యాట్రిక్ నమోదు చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతడు హ్యాట్రిక్ సాధించకుండా అడ్డుపడ్డాడు. అయితే.. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతికి సూర్యను ఔట్ చేశాడు సాకిబ్. దీంతో భారత్ 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
IND vs ENG : వామ్మో హర్షిత్ రాణా చరిత్ర సృష్టించాడుగా.. ప్రపంచ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు
భారత్ పై పొట్టి ఫార్మాట్‌లో ఒకే ఒక్కడు..
ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు పరుగులు ఏమీ ఇవ్వకుండా (మెయిడిన్)గా సాకిబ్ ఈ ఓవర్‌ను ముగించాడు.ఈ క్రమంలో సాకిబ్ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ పై ట్రిపుల్ వికెట్ మెయిడెన్ వేసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదండోయ్ ఇంగ్లాండ్ జట్టు తరుపున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గానూ నిలిచాడు. మరే ఇంగ్లాండ్ బౌలర్ కూడా వేరే ఏ జట్టు పై కూడా ఈ ఫీట్‌ను సాధించలేదు.
ఇక ఓవరాల్‌గా టీ20 క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ వికెట్ మెయిడెన్ ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ మాజీ పేసర్ జెరోమ్ టేలర్ మాత్రమే సాకిబ్ కంటే ముందు ఈ ఘనత అందుకున్నాడు. 2007లో దక్షిణాప్రికా పై అతడు ఈ ఘనత అందుకున్నాడు.
ఇక సాకిబ్ రాణించినా శివమ్ దూబె (53), హార్దిక్ పాండ్యా (53)లు విజృంభించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక నామమాత్రమైన ఐదో టీ20 మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 2) జరగనుంది.