IND vs NZ : భార‌త్‌, న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్‌.. చిన్న‌ ట్విస్ట్‌.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆధిప‌త్యం ఎవ‌రిదంటే?

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా మ‌రో హోరాహోరీ మ్యాచ్‌కు రంగం సిద్ధ‌మైంది.

IND vs NZ Head to Head record do you know who is upper hand in Champions Trophy history

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా మ‌రో హోరాహోరీ మ్యాచ్‌కు రంగం సిద్ధ‌మైంది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ రెండు జ‌ట్లు ఇప్ప‌టికే సెమీస్‌కు చేరుకున్న నేప‌థ్యంలో ఈ మ్యాచ్ నామ‌మాత్రంగా మారింది. అయితే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు గ్రూప్‌-ఏలో అగ్ర‌స్థానంతో సెమీస్‌లో అడుగుపెట్ట‌నున్న నేప‌థ్యంలో మ్యాచ్ ను రెండు జ‌ట్లు తేలిక‌గా తీసుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

ప్ర‌స్తుతం గ్రూప్‌-ఏ పాయింట్ల ప‌ట్టిక‌ను ప‌రిశీలిస్తే.. భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచాయి. రెండు జ‌ట్ల ఖాతాల్లోనూ స‌మానంగా నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే.. భార‌త్ (+0.647) నెట్ ర‌న్‌రేట్ కంటే న్యూజిలాండ్ (+0.863) నెట్‌ర‌న్‌రేట్ ఎక్కువ‌గా ఉండ‌డంతో కివీస్ అగ్ర‌స్థానంలో ఉండ‌గా, భార‌త్ రెండో స్థానంలో ఉంది. ఆదివారం కివీస్ పై భార‌త్ గెలిస్తే 6 పాయింట్లు భార‌త్ ఖాతాలో చేరుతాయి. అప్పుడు అగ్ర‌స్థానంతో భార‌త్ సెమీస్‌లో అడుగుపెడుతుంది.

Champions Trophy 2025 : ష‌మీ మామూలోడు కాదురా అయ్యా.. కోహ్లీ మిడిల్ స్టంప్‌ను లేపేశాడు..

హెడ్ టు హెడ్ రికార్డులు..
ఛాంపియ‌న్స్ ట్రోఫీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న్యూజిలాండ్‌, భార‌త్ జ‌ట్లు ఎన్ని సార్లు త‌ల‌ప‌డ్డాయి ? వ‌న్డేల్లో ఎవ‌రు ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలిచారు? ఐసీసీ ఈవెంట్ల‌లో పై చేయి ఎవ‌రిదో ఓ సారి చూద్దాం..

భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్లు 118 వ‌న్డేల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్ 60 మ్యాచ్‌ల్లో భార‌త్ విజ‌యం సాధించ‌గా, 50 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచింది. 7 మ్యాచ్‌లు ర‌ద్దు అయ్యాయి. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక ఛాంపియ‌న్స్ ట్రోఫీ చ‌రిత్ర‌లో ఈ రెండు జ‌ట్లు కేవ‌లం ఒక్క సారి మాత్ర‌మే ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఆ మ్యాచ్‌లో కివీస్ గెలుపొందింది.

Champions Trophy 2025 : నీ మాట నిజం కావాలి సామీ.. అదే జ‌రిగితే మాత్రం..

ఇక ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్, న్యూజిలాండ్ లు 11 సంద‌ర్భాల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో చెరో 5 మ్యాచ్‌ల్లో భార‌త్, కివీస్ గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫ‌లితం రాలేదు.

ట్విస్ట్ ఏంటంటే?

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఈ రెండు జట్ల మ‌ధ్య జ‌రిగిన చివ‌రి 5 వ‌న్డే మ్యాచ్‌ల్లో భార‌త్ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. 5 మ్యాచ్‌ల్లోనూ భార‌త్ జ‌య‌కేతనం ఎగురవేసింది. ఇది ఆదివారం కివీస్‌తో త‌ల‌ప‌డ‌బోయే ముందు భార‌త్ ఆత్మ‌విశ్వాసాన్ని మ‌రింత పెంచుతుంది. అయితే.. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌ట్టో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కాస్త ఏమ‌ర‌పాటుగా ఉన్న భార‌త్‌కు షాక్ త‌ప్ప‌దు.