IND vs SA 5th T20 Sanju samson will open for Team India
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్లు శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా ఐదో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. లక్నో వేదికగా జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదో టీ20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతానికి భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఐదో టీ20 మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవాలని భారత్ ఆరాటపడుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది.
ఓపెనర్‌గా సంజూ శాంసన్..
ఈ మ్యాచ్‌లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. దీంతో అతడు నాలుగో టీ20 మ్యాచ్‌తో పాటు ఐదో టీ20 మ్యాచ్‌కు దూరం అయినట్లు ఇప్పటికే బీసీసీఐ వెల్లడించింది.
ఇక గిల్ గైర్హాజరీలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతడు అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు సంజూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ మ్యాచ్‌లో రాణించి టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వ్యక్తిగత కారణాలతో మూడో టీ20 మ్యాచ్‌కు దూరమైన బుమ్రా ఐదో టీ20లో బరిలోకి దిగొచ్చు. ఇక అక్షర్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌కు తుది జట్టులో చోటు దక్కొచ్చు.
ఐదో టీ20 మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా)..
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.