Cheteshwar Pujara angry After India Loss To South Africa in 1st Test
IND vs SA : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. సఫారీ స్పిన్నర్ల ధాటికి 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. ఈ క్రమంలో భారత జట్టు పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక ఎప్పుడూ ఎంతో కూల్‌గా కనిపించే ఛతేశ్వర్ పుజరా సైతం తన సహనం కోల్పోయాడు. సొంత గడ్డపై భారత జట్టు ఓడిపోవడం పట్ల అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు పరివర్తన దశలో ఉంది. ఈ విషయాన్ని పుజారా అంగీకరిస్తూనే.. ఎంతో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో ఉన్న భారత జట్టు స్వదేశంలో మ్యాచ్‌లను ఓడిపోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు.
Shubman Gill : ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు స్వల్ప ఊరట..
స్వదేశంలో భారత జట్టు ఓడిపోవడాన్ని తాను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ‘ప్రస్తుతం జట్టు పరివర్తన దశలో ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఓడిపోయింది. అది అర్థం చేసుకోవచ్చు. అయితే.. దేశవాళీ క్రికెట్‌లో ఎంతో అద్భుతన రికార్డులు ఉన్న యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికి కూడా స్వదేశంలో భారత్ ఓడిపోయింది. అంటే ఎక్కడో తప్పు జరిగిందని అర్థం చేసుకోవాలి.’ అని పుజారా అన్నాడు.
ప్రత్యర్థి జట్టును స్పిన్ ఉచ్చులో పడేసి విజయం సాధించాలని టీమ్ఇండియా అనుకుంటుందని, అయితే.. అదే ఉచ్చులో భారత్ చిక్కుకుని ఓడిపోయిందన్నాడు. అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌కు సమతూకంగా ఉండే పిచ్‌లను తయారు చేసుకుని ఉంటే భారత్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవన్నాడు. టీమ్ఇండియా బ్యాటర్లు స్పిన్‌ను ఆడే విధానం పై మరింత కసరత్తు చేయాల్సి ఉందన్నాడు.
గత ఆరు టెస్టుల్లో భారత్ కు స్వదేశంలో ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ 0-3 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.