IND vs WI 2nd Test Yashasvi Jaiswal tea time message revealed by batting coach Sitanshu Kotak
IND vs WI 2nd Test : వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. ఢిల్లీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజే భారీ శతకం బాదాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 173 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో జైస్వాల్ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇక జైస్వాల్ ఇలా బ్యాటింగ్ చేసేందుకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోథక్ ఇచ్చిన సలహానే కారణం. కోచ్ ఇచ్చిన సలహాలను చక్కగా అమలు చేసిన జైస్వాల్ మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో సితాన్ష్ వెల్లడించారు. జైస్వాల్ ఆటతీరును చూసి తాను ముగ్ధుడయ్యానని చెప్పారు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయిన జైస్వాల్ రెండో టెస్టు మ్యాచ్‌లో చెత్త షాట్ ఆడకూడదని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించాడు. తన వరకు యశస్వి.. ఆటపై చూపించిన నిబద్ధత, దృఢ సంకల్పం నచ్చిందన్నారు.
ఈ మ్యాచ్‌లో కొత్త బంతి బ్యాట్ పైకి చక్కగా వచ్చిందన్నాడు. ‘జైస్వాల్.. రెండో అర్ధశతకం కూడా పేస్ బాగా ఉన్నప్పుడే పూర్తి చేసుకున్నాడు. కానీ.. 60 నుంచి 65 ఓవర్ల తరువాత బంతి పాతగా మారింది. బ్యాట్ పైకి రావడం లేదని గ్రహించాను. అప్పుడు కాస్త సమయం తీసుకుని ఆడితే బాగుంటుందని అనిపించింది. చెత్త షాట్ ఆడకూడదు. ఇదే విషయాన్ని టీ బ్రేక్ సమయంలో జైస్వాల్‌కు చెప్పాడు. గత మ్యాచ్‌లో చేయలేకపోయిన భారీ ఇన్నింగ్స్‌ను ఈ సారి వదిలి పెట్టకూడదని అతడికి చెప్పాను. ఆ తరువాత అతడు ఆడిన తీరు బాగుంది.’ అని సితాన్ష్ తెలిపాడు.
సాధారణంగా జైస్వాల్ దూకుడుగా ఆడతాడని, వేగంగా పరుగులు చేస్తాడని చెబుతుంటారు. అయితే.. పిచ్ పరిస్థితిని త్వరగా అంచనా వేసి అందుకు తగినట్టుగా అతడు బ్యాటింగ్ చేయడంలో నేర్పరి అని సితాన్ష్ తెలిపాడు. అతడి షాట్ల ఎంపిక కూడా చాలా బాగుంటుందన్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. జైస్వాల్ (173), శుభ్‌మన్ గిల్ (20) లు క్రీజులో ఉన్నారు.