వెస్టిండీస్ జట్టుతో పరిమిత ఓవర్ల హోంసిరీస్ ఆడే భారత జట్టును గురువారం (నవంబర్ 21న) బీసీసీఐ ప్రకటించనుంది. ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కోల్ కతాలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా వెస్టిండీస్ జట్టుతో మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిరీస్ లు ఆడే భారత జట్టును ప్రకటించనుంది.
ఇప్పటివరకూ బీసీసీఐలో సెలెక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యుల ప్యానెల్ కు ఇదే చివరి అప్పగింత కానుంది. ఇందులో దేవంగ్ గాంధీ, గగన్ ఖోడా, జాటిన్ పరాన్ జేప్, శరణ్ దీప్ సింగ్ తదితరులు ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 1న బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం (AGM) జరుగనుంది.
ఈ సమావేశంలో కొత్త సెలెక్షన్ కమిటీ నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త ప్యానెల్ ఏర్పాటుకు సంబంధించి సంకేతాలను టాప్ అఫీషియల్స్ ఇచ్చారు. ఈ కొత్త సెలెక్షన్ ప్యానల్ మెంబర్లుగా భారత మాజీ క్రికెటర్లలో లక్ష్మణ్ శివరామక్రిష్ణన్, దీప్ దేశ్ గుప్తా, అశీష్ నెహ్రాల పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుత సెలెక్షన్ కమిటీ కోల్ కతాలో సమావేశం కానున్న తరుణంలో వెస్టిండీస్ తో వన్డే సిరీస్‌కు భారత జట్టు తరపున రోహిత్ శర్మను తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తి నెలకొంది.
సీజన్ల వారీగా సుదీర్ఘంగా రోహిత్ ఆడటం అతడిపై వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందనే కారణంతో సెలెక్టర్లు అతడికి విశ్రాంతి కల్పించాలని నిర్ణయించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తో జరిగిన టీ20సిరీస్ లో విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో.. అతడి స్థానంలో రోహిత్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు కూడా రోహిత్ తో మాట్లాడిన అనంతరం నిర్ణయం తీసుకోవచ్చు.
మరోవైపు మహిళల సెలెక్షన్ కమిటీ కూడా నవంబర్ 21న కోల్ కతాలో సమావేశం కానుంది. ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిరీస్ మహిళల క్రికెట్ జట్టును ప్రకటించనుంది. డిసెంబర్ 9 నుంచి ఈ సిరీస్ ప్రారంభమై డిసెంబర్ 24వరకు కొనసాగనుంది. అయితే మహిళల భారత జట్టులో టాప్ ప్లేయర్లు ఎవరు లేరు. జాతీయ జట్టులో పెద్దగా అవకాశం రాని మాన్షి జోషి, హేమలత, దయాలాన్, హెర్లీన్ డోయెల్ సహా జట్టును సెలెక్టర్లు ప్రకటించనున్నారు.