Under-19 World Cup: లాస్ట్ బాల్ సిక్స్.. ప్రపంచకప్‌లో సెమీస్‌కి యువ భారత్!

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తున్న అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది.

Under 19

Under-19 World Cup: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తున్న అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది. లేటెస్ట్‌గా 2020లో ఫైనల్‌లో ఓడించిన బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకుని సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 30.5 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కౌశల్ తాంబే ఇన్నింగ్స్‌లో లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి భారత్‌ను సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు భారత్ బౌలింగ్‌ దెబ్బకు 37.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ఆరంభంలోనే 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన రవి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 5వికెట్లు కోల్పోయి భారత్.. 30.5 ఓవర్లలో 117పరుగులు చేసి గెలుపు సొంతం చేసుకుంది. భారత్‌కు బ్యాటింగ్ ఆరంభం అంతగా అనుకూలించలేదు. హర్నూర్‌ ఖాతా తెరవకుండానే పెవీలియన్ చేరగా.. అంగ్‌క్రిష్‌, షేక్‌ రషీద్‌లు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 44 పరుగుల వద్ద అంగ్క్రిష్ ఔటయ్యాడు. ఆ తర్వాత 26 పరుగుల వద్ద రషీద్ వికెట్ కోల్పోయింది భారత్. వెంటనే తొలి మ్యాచ్ అరంగేట్రం చేసిన సిద్ధార్థ్ యాదవ్ ఔటయ్యాడు. వెంటనే మునుపటి మ్యాచ్‌లో హీరో రాజ్ బావా కూడా సున్నాకే ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ యశ్ దుల్.. కౌశల్ తాంబేతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వాళ్లిద్దరూ నాటౌట్‌గా నిలిచారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ యశ్ దుల్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫాస్ట్‌ బౌలర్‌ రవికుమార్‌ ప్రారంభంలోనే మూడు వికెట్లు తీసుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌కు కష్టతరమైన పిచ్‌పై ఏడు ఓవర్లలో 14 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు రవి కుమార్. లెఫ్టార్మ్ స్పిన్నర్ విక్కీ ఓస్త్వాల్(2/25) కూడా సరిగ్గా బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థులు నిలదొక్కుకోలేకపోయారు. బంగ్లాదేశ్ ఒక దశలో 56 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ తరపున మెహరోబ్ 30పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.