ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది.

India vs England 2nd Test India won by 106 runs

India vs England 2nd Test: తొలి టెస్టులో పరాజయానికి టీమిండియా బదులు తీర్చుకుంది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లీషు జట్టును చిత్తుగా ఓడించింది. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది. 67/1 ఓవర్ నైట్ స్కోరుతో 4వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి ఆట మరో రోజు మిగిలుండగానే ఓటమిపాలయింది.

ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే అర్ధసెంచరీతో రాణించాడు. 132 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ తో 73 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలో ఎవరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో ఇంగ్లండ్ కు ఓటమి తప్పలేదు. బెన్ ఫోక్స్(36), టామ్ హార్ట్లీ(36) కాసేపు పోరాడారు. వీరిద్దరినీ బుమ్రా అవుట్ చేశాడు. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్ తో బెన్ స్టోక్స్ ను రనౌట్ చేశాడు.

బెన్ స్టోక్స్ అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చింది. మిగతా మూడు వికెట్లను చకాచకా పడగొట్టి టీమిండియా బౌలర్లు జట్టును భారీ విజయాన్ని అందించారు. బుమ్రా, అశ్విన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396, ఇంగ్లండ్ 253 పరుగులు చేశాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులు చేసింది. మొత్తం 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 5 మ్యాచ్‌ల‌ సిరీస్‌లో ఇరు జట్లు చెరోటి గెలిచి సమంగా నిలిచాయి. మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్‌కోట్‌లో ఈనెల 15న ప్రారంభమవుతుంది.

Also Read: షోయబ్ 3వ పెళ్లి కారణంగా స్కూల్లో వేధింపులు ఎదుర్కొన్న సానియా మీర్జా కొడుకు..

ట్రెండింగ్ వార్తలు