JP Nadda and Sukhvinder Singh Sukhu
JP Nadda and Sukhvinder Singh Sukhu : భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో ఆదివారం భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీలుగా గుర్తింపు ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్యనేతలు మ్యాచ్ సందర్భంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ కనిపించారు.
Read Also : Rohit Sharma : కోహ్లీ గురించి చెప్పాల్సింది ఏమీ లేదు.. సగం దూరం వచ్చాం : రోహిత్ శర్మ
నిజానికి ఎప్పుడూ ఒకరితో ఒకరు పార్టీల పరంగా విబేధించుకుంటూ ఉంటారు. కానీ ఇండియా, కివీస్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి సందడి చేశారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్, మంత్రి హర్షవర్దన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కలిసి మ్యాచ్ ను వీక్షించారు. వీరితో పాటు హిమాచల్ ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ బిందాల్, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా స్టాండ్స్‌లో టీమ్ ఇండియాను ఉత్సాహపరుస్తూ కనిపించారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మధ్య కూర్చొని కనిపించారు. వీరంతా వీవీఐపీ స్టాండ్ లో కూర్చొని మ్యాచ్ వీక్షించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వీరు సరదాగా ముచ్చట్లు పెట్టుకోవటం కనిపించింది. వీరికితోడు బీసీసీఐ సెక్రటరీ జేషా, ఐపీఎల్ ప్రెసిడెంట్ అరుణ్ ధమాల్ తదితరులు ఉన్నారు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు స్టేడియంలోని క్రికెట్ అభిమానులు టీమిండియా నామస్మరణ చేశారు. క్రీడారంగం పట్ల మన దేశానికి ఉన్న ఉత్సాహానికి ఈ ఘటనే నిదర్శనమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసించారు.