Rohit Sharma : కోహ్లీ గురించి చెప్పాల్సింది ఏమీ లేదు.. సగం దూరం వచ్చాం : రోహిత్ శర్మ
మెగా టోర్నీలో ఒక్కొ మ్యాచులో గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వివరించాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు వరుసగా ఐదు మ్యాచులు గెలవడం పట్ల సంతోషంగా ఉందన్నాడు.

Virat Kohli-Rohit Sharma
Rohit Sharma-Virat Kohli : వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకువెలుతున్న న్యూజిలాండ్‌కు భారత జట్టు బ్రేకులు వేసింది. ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా విజయంలో మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కీలక పాత్ర పోషించారు. కాగా.. భారత్‌కు ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఇది ఐదో విజయం కావడం విశేషం. మ్యాచ్ అనంతరం దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు.
సగం దూరం వచ్చాం..
మెగా టోర్నీలో ఒక్కొ మ్యాచులో గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వివరించాడు. ఇప్పటి వరకు వరుసగా ఐదు మ్యాచులు గెలవడం పట్ల సంతోషంగా ఉందన్నాడు. ప్రపంచకప్ సాధించాలనే తమ లక్ష్యంలో ఇప్పటికి సగం మాత్రమే పూర్తి అయ్యిందని చెప్పాడు. జట్టు సమతూకంగా ఉంచడం చాలా కీలకమన్నాడు. తరువాతి మ్యాచుల్లో ఏం జరుగుతుందన్న దానిపై ప్రస్తుతం ఏం ఆలోచించడం లేదని చెప్పాడు. వర్తమానంలో ఉండటమే తమకు ముఖ్యమన్నాడు.
Gautam Gambhir : భారత క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త సెలక్షన్ కమిటీ అదే..
ఇక షమీ తనకు అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడని వెల్లడించాడు. ధర్మశాల వంటి వికెట్ షమీ బౌలింగ్‌కు మరింత అనుకూలంగా ఉంటుందని నిరూపించాడన్నారు. ఓ దశలో న్యూజిలాండ్ జట్టు 300 పైగా పరుగులు చేస్తుందని తాము భావించామని అయితే ఆఖరి ఓవర్లలో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారన్నాడు. లక్ష్య చేధన అంటే తనకు ఇష్టమని, ఆ సమయంలో బ్యాటింగ్ చేయడాన్ని ఎంతో ఆస్వాదిస్తానని తెలిపాడు.
కోహ్లీ గురించి చెప్పాల్సింది ఏమీ లేదు..
విరాట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. గత కొన్నాళ్లుగా జట్టు కోసం విరాట్ ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు అని తెలిపాడు. ఆఖర్లో రెండు వికెట్లు పడినప్పుడు కాస్త కంగారు అనిపించిందని, అంతిమంగా గెలవడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు నేలపాలు చేశామని ఒప్పుకున్నాడు. అయితే.. ఆ తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం అని రోహిత్ అన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (130) సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా, సిరాజ్‌లు చెరో వికెట్ సాధించారు. అనంతరం లక్ష్యాన్ని భారత్ 48 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (95) తృటిలో శతకాన్ని రోహిత్ శర్మ(46) అర్ధశతకాన్ని చేజార్చుకున్నారు.