×
Ad

IND vs SA T20 Match : రెండో టీ20లో భారత్ ఓటమికి ఐదు ప్రధాన కారణాలు ఇవే.. వాళ్లవల్లే ఓడాం.. చేతులెత్తేశారు..

IND vs SA T20 Match : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి రెండో టీ20 మ్యాచ్ జరిగింది.

IND vs SA T20 Match

IND vs SA T20 Match : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లోనూ జట్టు ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. దీంతో తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ జట్టు.. రెండో టీ20లో ఘోర ఓటమిని చవిచూసింది.

బ్యాటుతో, బంతితో విఫలమైన టీమిండియా రెండో టీ20లో 51 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై పరాజయంపాలైంది. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ 62 పరుగులతో రాణించినప్పటికీ ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత ఓవర్లలో 213 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ఓటమికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయి.

బ్యాటింగ్ ఆర్డర్‌లో అనవసరమైన మార్పులు..
తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ వికెట్లను భారత్ జట్టు కోల్పోయింది. అక్షర్ పటేల్ ను మూడో స్థానంలోకి పంపించారు. కానీ, పవర్ ప్లేలో అక్షర్ అంచనాలను అందుకోలేకపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన రెగ్యూలర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిఉంటే బహుశా అతని 30-40 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ మ్యాచ్ ను టీమిండియాకు అనుకూలంగా మార్చేది. అక్షర్ మూడో స్థానంలోకి రావడంతో తిలక్ వర్మతో సహా అందరు బ్యాటర్ల ఆర్డర్ మారిపోయింది. ఫినిషర్ పాత్ర పోషించే శివం దూబే ఎనిమిదో స్థానంలోకి వచ్చాడు. రెండో స్థానంలో బ్యాటింగ్ చేయడం అలవాటు లేని బ్యాటర్ రెండో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.

కెప్టెన్, వైస్ కెప్టెన్లు విఫలం..
భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం కొనసాగుతుంది. పరుగులు రాబట్టడంలో సూర్య ఇబ్బంది పడుతున్నాడు. రెండో టీ20లోనూ సూర్యకుమార్ యాదవ్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్డాడు. కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో గిల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరాడు.

హార్డిక్ పాండ్యా స్లో ఇన్నింగ్స్..
తొలి టీ20 మ్యాచ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికా జట్టు ఓటమికి కారణమైన హార్దిక్ పాండ్యా.. రెండో టీ20 మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 7.3 ఓవర్లలో 67/4 పరుగులతో జట్టు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్.. నెమ్మదిగా ఆడాడు. అతను 23 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. హార్దిక్ వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టి ఉండిఉంటే భారత జట్టు విజయానికి చేరువయ్యేది.

బుమ్రా, ఆర్ష్‌దీప్ 99 పరుగులు..
భారత ఓటమికి తొలి ఇన్నింగ్స్‌లోనే పునాది పడింది. జట్టులోని ఇద్దరు ప్రధాన టీ20 ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పూర్తిగా విఫలమయ్యారు. వీరిద్దరూ కలిసి 99 పరుగులు సమర్పించుకున్నారు. బుమ్రా తన నాలుగు ఓవర్లలో 45 పరుగులు సమర్పించగా, అర్ష్‌దీప్ తన నాలుగు ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఏకంగా ఏడు వైడ్లు వేశాడు. ఇన్నింగ్స్‌లో అతడు మొత్తం తొమ్మిది వైడ్లు వేశాడు.

అక్షర్ పటేల్ వైఫల్యం..
అక్షర్ పటేల్ మూడో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. పవర్ ప్లేలోకి దూకుడుగా ఉండాల్సిన చోట, ఆరో ఓవర్ వరకు 17 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అక్షర్ తన ఇన్నింగ్స్‌ను వేగవంతం చేయలేకపోయాడు. 21 బంతుల్లో 21 పరుగులు చేయడం లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడిని పెంచింది.