India vs South Africa 5th T20
IND vs SA : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టీ20 మ్యాచ్ ఇవాళ రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే 2-1 అధిక్యంలో ఉన్న భారత్ జట్టు.. చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఆటగాళ్లుసైతం ఈ మ్యాచ్‌లో విజయంతో సిరీస్ ను సమం చేయాలని పట్టుదలతో ఉన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది.
Also Read : Ishan kishan : ఏం కొట్టుడు కొట్టావ్ బ్రో.. ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం.. వీడియో వైరల్
చివరి టీ20 మ్యాచ్ సమయంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా కీలక బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్ కు దూరమైనట్లు తెలుస్తోంది. లఖ్‌నవూలో నాలుగో టీ20 మ్యాచ్ కు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కాలి బొటనవేలికి బంతి తగిలి నొప్పితో గిల్ బాధపడ్డాడు. దీంతో గిల్ చివరి మ్యాచ్ కు అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై భారత జట్టు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ మ్యాచ్ లో గిల్ ఉన్నట్లా లేనట్లా..? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సిరీస్ లో గిల్ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. మూడు మ్యాచ్ లలో కలిపి కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు.
దక్షిణాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్ సందర్భంగా అందరి చూపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పైనే ఉంది. గడిచిన మూడు మ్యాచ్ లలో సూర్యకుమార్ యాదవ్ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ లోనైనా సూర్య బ్యాటు ఝుళిపిస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. ఈ సిరీస్ లో సూర్యకుమార్ మూడు మ్యాచ్ లలో కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. సూర్య రాణించకపోతే టీ20 ప్రపంచకప్ సమీపిస్తుండగా కెప్టెన్‌ను మార్చాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. చివరి మ్యాచ్ లోనూ సూర్య పరుగులు రాబట్టకపోతే అతనిపై తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు పిచ్ పరిస్థితుల దృష్ట్యా తుది జట్టులో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే, అహ్మదాబాద్ లోని భారత జట్టు ఇప్పటి వరకు ఏడు టీ20 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్ లలో విజయం సాధించగా.. రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది.
ఇదిలాఉంటే.. అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది. కానీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పేసర్లకూ అవకాశం ఉండొచ్చు. ఇక్కడ పరుగులు బాగానే వస్తాయి. మ్యాచ్ కు వాతావరణం పరంగా ఇబ్బంది లేదని తెలుస్తోంది. మంచు ప్రభావం ఉన్నా నామమాత్రంగానే ఉంటుందని చెబుతున్నారు. అయితే, లఖ్‌నవూలో మంచు ప్రభావంతో నాల్గో టీ20 మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే.