Shubman Gill : ఇంగ్లాండ్ పై తొలి టెస్టులో ఓట‌మి.. టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఖాతాలో చెత్త రికార్డు..!

శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు తొలి మ్యాచ్‌లోనే షాక్ త‌గిలింది.

Shubman Gill

ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భార‌త్ ఓట‌మితో ప్రారంభించింది. హెడింగ్లీ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బార‌త్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డంతో శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు తొలి మ్యాచ్‌లోనే షాక్ త‌గిలింది. ఈ మ్యాచ్‌లో బ్యాట‌ర్‌గా రాణించిన‌ప్ప‌టికి కెప్టెన్సీలో గిల్ విఫ‌లం అయ్యాడు. జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు.

ఈ క్ర‌మంలో ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్సీ చేప‌ట్టిన తొలి మ్యాచ్‌లో సెంచ‌రీ చేసినా జ‌ట్టును గెలిపించుకోలేక‌పోయిన కెప్టెన్ల జాబితాలో గిల్ చేరాడు.  కోహ్లీ, దిలీప్ వెంగ్‌స‌ర్కార్ ఉన్న జాబితాలో గిల్ చేరాడు. కోహ్లీ, దిలీప్ వెంగ్ స‌ర్కార్ సైతం టెస్టు కెప్టెన్సీ చేప‌ట్టిన తొలి టెస్టులోనే శ‌త‌కాలు చేసినా ఆయా మ్యాచ్‌ల్లో భార‌త జ‌ట్టు ఓడిపోయింది.

ICC Test Rankings : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌..

వెస్టిండీస్‌తో 1987లో అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో వెంగ్ స‌ర్కార్ భార‌త జ‌ట్టు కెప్ట‌న్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఆ మ్యాచ్‌లో అత‌డు రెండో ఇన్నింగ్స్‌లో 102 ప‌రుగులతో రాణించినా భార‌త జ‌ట్టు 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఇక ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో 2014 డిసెంబ‌ర్‌లో అడిలైడ్ ఓవెల్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భార‌త టెస్టు జ‌ట్టుకు మొద‌టిసారి కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు కోహ్లీ. ఆ మ్యాచ్‌లో అత‌డు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శ‌త‌కాలు బాదాడు. కానీ ఆ మ్యాచ్‌లో భార‌త్ 48 ప‌రుగుల‌తో ఓడిపోయింది.