120 శాతం ఆడాలి.. లేదా తప్పుకోవాలి: కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ సీజన్‌కు ముందు ప్రేరణాత్మకమైన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మార్చి 23న మ్యాచ్ జరగనుండగా ఒక రోజు ముందుగా మీడియా సమావేశంలో పాల్గొన్న కోహ్లీ ప్లేయర్లను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడి ఆకట్టుకున్నాడు. 

‘మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగామంటే 120 శాతం ప్రదర్శన చూపెట్టాల్సిందే. అలా చేయొచ్చు. నేను ఆడతున్నంతసేపు పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వడానికి కష్టపడతా. శనివారం మ్యాచ్ ఆడేందుకు వ్యక్తిగతంగా ప్రేరణ పొందా. ప్రతి భారత క్రికెటర్ ఎంతటి ఒత్తిడిలోనైనా రిలాక్స్‌డ్‌గా ఉన్నా పరిస్థితులను బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి’

‘ఒక జట్టుకు ఆడుతున్నామంటే ఆ యాజమాన్యం మనపైన పెట్టుకున్న ఆశలకు న్యాయం చేయాలి. క్రీజులో ఉన్నంతసేపు 120శాతం కష్టపడాలి. 75పర్సెంట్.. 80 పర్సెంట్ ఆడేసి గెలిచేస్తామనుకోవడంలో అర్థం లేదు. ఆడతున్నంతసేపు నేను అలాగే ఫీలవుతా.. ఆడకుండా ఉన్నప్పుడు రిలాక్స్‌డ్ మైండ్ సెట్‌తో ఉంటా’ 

‘ప్లేయర్లు ఒక్కో రోజు అలసిపోయినట్లుగా కనిపిస్తారు. అలా ఉంటే ముందుగానే ఫిజియోలతో చర్చించాలి. దానికి తగ్గ పరిష్కారం త్వరగా తీసుకుంటే తర్వాతి మ్యాచ్‌కు పూర్తిగా కోలుకోగలం. ప్లాన్‌కు అనుగుణంగా జట్టుతో కలిసి ప్రయాణిస్తేనే విజయం పొందగలం’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రసంగించాడు.