IPL 2020 players ruled out and replacements : ధనాధన్ సమరానికి వేళైంది. కరోనాతో ఆగిన IPL క్రికెట్ మ్యాచ్‌లు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. 2020, సెప్టెంబర్ 06వ తేదీ ఆదివారం IPL 2020 Schedule విడుదలకానున్నట్లు సమాచారం.
IPL పదమూడో సీజన్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. అయితే నిర్వాహకులు ఇంకా మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేయలేదు. ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్‌లో ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ‘డ్రీమ్ 11 ఐపీఎల్‌కు ఇంకా 14 రోజులే మిగిలి ఉన్నాయి. ఆగలేకపోతున్నాం’ అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్‌ల ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆనవాయితి ప్రకారం గతేడాది ఫైనల్‌కు చేరిన జట్లతోనే ఏటా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. గత సీజన్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తుదిపోరులో తలపడ్డాయి. దీంతో ఈ రెండు జట్లతోనే ఈసారి పదమూడో సీజన్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ కన్నా ముందు మొదటిసారి విడుదల చేసిన షెడ్యూల్‌లో.. మార్చి 29న ఈ జట్లతోనే టోర్నీని ప్రారంభించాలని చూశారు.
కరోనా పరిస్థితుల కారణంగా మెగా టోర్నీ ఆరు నెలలు వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ ఆ జట్లతోనే ప్రారంభించాల్సి ఉన్నా.. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కరోనా బారిన పడటం, ఆ జట్టు క్వారంటైన్ గడువు పెరగడంతో షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మరోవైపు రైనా, హర్భజన్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఆ జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఇలా కోహ్లీ, దినేశ్ కార్తిక్‌ల పోస్టర్‌ను విడుదల చేసి ఆసక్తి పెంచింది. అయితే, దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.