SRH Vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా?

కోల్‌కతాతో పోలిస్తే హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉండడం, ఈ సీజన్‌లో సన్‌రైజర్లు బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో ఫైనల్‌లోనూ..

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ అద్భుతంగా ఆడుతోంది. తన రికార్డులు తానే చెరిపివేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఫైనల్‌లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్ చేరిన మరో జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను తక్కువ చేసి చూడడానికి లేదు. పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. 15 మ్యాచ్‌ల్లో పదింటిలో గెలిచి మూడింటిలో మాత్రమే ఓడింది.

క్వాలిఫయర్ 1లో హైదరాబాద్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. లీగ్ దశలోనూ హైదరాబాద్‌పై గెలుపొందింది. అయితే ఈ రికార్డును పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఫైనల్‌లో సన్‌రైజర్స్ దుమ్మురేపడం ఖాయమని అభిమానులంటున్నారు. కోల్‌కతా గతంలో రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. ఐపీఎల్‌లో కోల్‌కతా ఫైనల్‌కు చేరడం ఇది నాలుగోసారి.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సారి స్థిరంగా ఆడుతోంది. 14 మ్యాచ్‌ల్లో 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌పై వరుస విజయాలతో ఘనంగా సీజన్‌ను ఆరంభించింది. ఓపెనింగ్ జోడీ జునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ అద్భుతాలు సృష్టిస్తున్నారు.

ఎవ్వరి బౌలింగ్‌పైనైనా ఎదురుదాడి చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో కోల్‌కతా ఈ సీజన్‌లో మూడో అత్యధిక స్కోరు 272 నమోదుచేసింది. ఆ మ్యాచ్‌లో సునీల్ నరైన్ 39 బంతుల్లో 85 పరుగులు చేశాడు. పంజాబ్ సూపర్ కింగ్స్‌పై 261 పరుగులు చేసింది. 2011లో తొలిసారి ప్లే ఆఫ్స్‌కు చేరిన కోల్‌కతా ఇప్పటిదాకా రెండుసార్లు ఐపీఎల్ గెలిచింది.

మొత్తంగా నాలుగుసార్లు ఫైనల్‌కు చేరింది. ఈ సీజన్‌లో క్వాలిఫయర్ 1లో సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. 2012, 2014లో కప్ గెలిచిన కోల్‌కతా 2021లో ఓడిపోయింది. 2012లో చెన్నై చెపాక్ స్టేడియంలోనే సూపర్‌కింగ్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది కోల్‌కతా. ఇప్పుడు ఫైనల్ జరిగేది చెపాక్ స్టేడియంలోనే.

స్పిన్‌ మాయాజాలంతోనే..
రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో స్పిన్‌ మాయాజాలంతోనే సన్‌రైజర్స్ గెలుపును సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్‌లో హైదరాబాద్ ఎక్కువగా పేస్‌ బౌలింగ్‌పై ఆధారపడింది. హైదరాబాద్‌తో పోలిస్తే కోల్‌కతా స్పిన్ బౌలింగ్ బలంగా ఉంది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కోల్‌కతా స్పిన్నర్లు కట్టడి చేస్తున్నారు.

సునీల్‌ నరైన్, వరుణ్ చక్రవర్తి సన్‌రైజర్స్ పైనా అలాగే ఒత్తిడి పెంచుతారని కోల్‌కతా మద్దతుదారులంటున్నారు. అలాగే లీగ్ స్టేజ్‌లోనూ, క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌పై కోల్‌కతా ఘనవిజయాలు నమోదుచేసింది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓటమి, రెండో మ్యాచ్‌లో కష్టపడి రాజస్థాన్ రాయల్స్‌పై గెలవడం సనరైజర్స్‌పై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. అలాగే తొలి క్వాలిఫయర్‌లో గెలుపు తర్వాత కోల్‌కతా ప్రాక్టీస్‌కు నాలుగురోజుల సమయం దొరికింది. రెండో క్వాలిఫయర్ ఆడాల్సిరావడంతో సన్‌రైజర్స్ ఆటగాళ్లపై అలసట భారం పడింది.

కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో 27 సార్లు తలపడగా, 18 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందింది. 9 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ విజయం సాధించింది. అటు ఫైనల్‌లో సన్‌రైజర్స్ గెలిస్తే..పాట్ కమిన్స్‌ హైదరాబాద్‌కు కప్ అందించిన మూడో ఆస్ట్రేలియన్ అవుతాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్‌గా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్, 2016లో డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌ను గెలిపించారు.

అత్యధిక ధర పలికిన ఇద్దరు
అలాగే ఈ మ్యాచ్‌లో ఆసక్తికరమైన మరో విషయం 2023 వేలంలో అత్యధిక ధర పలికిన ఇద్దరు ఆటగాళ్లు ఫైనల్ పోరులో ప్రత్యర్థులుగా తలపడడం. వేలంలో 20కోట్ల 50లక్షలతో ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ దక్కించుకున్న కాసేపటికే 24 కోట్ల 75 లక్షలకు మిచెల్‌ స్టార్క్‌ను కొనుగోలు చేసింది కోల్‌కతా. ఇక T20 వరల్డ్‌కప్ ఆడే జట్టులో ఉన్న ఆటగాళ్లెవరూ ఈ ఐపీఎల్ ఫైనల్‌లో లేరు.

అయితే కోల్‌కతాతో పోలిస్తే హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉండడం, ఈ సీజన్‌లో సన్‌రైజర్లు బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో ఫైనల్‌లోనూ హైదరాబాద్‌కే గెలిచే అవకాశాలెక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు హైదరాబాద్ బ్యాటింగ్‌లో మాత్రమే కాదని, బౌలింగ్‌లోనూ బలంగా ఉందని కోల్‌కతా మెంటార్ గౌతమ్ గంభీర్ అంటున్నాడు.

Pat Cummins : ఐపీఎల్ ఫైన‌ల్‌కు ముందు.. ధోనీ సిక్స్‌ను క‌న్నార్ప‌కుండా చూస్తున్న క‌మిన్స్‌..

ట్రెండింగ్ వార్తలు