IPL 2024 : సొంతగడ్డపై చెలరేగిన హైదరాబాద్.. చెన్నైపై 6 వికెట్ల తేడాతో విజయం

సొంతగడ్డ ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చెలరేగింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నై వరుసగా రెండోసారి ఓటమిపాలైంది.

IPL 2024 : SRH Beat CSK By 6 Wickets

IPL 2024 : ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం (ఏప్రిల్ 5) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ సొంతగడ్డపై రెండోసారి విజయాన్ని అందుకుంది. 166 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులతో ఛేదించింది.

హాఫ్ సెంచరీతో మెరిసిన మార్‌క్రమ్ :
హైదరాబాద్ ఆటగాడు ఐడెన్ మార్‌క్రమ్‌ (50; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. అభిషేక్ శర్మ (37), ట్రావిస్ హెడ్ (31) పరుగులతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో షాబాజ్ అహ్మద్ (18), హెన్రిచ్ క్లాసెస్ (10), నితీష్ కుమార్ రెడ్డి (14) పరుగులకే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో మెయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ (37/12)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు.

వరుసగా రెండోసారి చెన్నై ఓటమి :
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు హైదరాబాద్‌కు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో చెన్నై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. చెన్నై ఆటగాళ్లలో శివం దూబే (45; 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు)తో హాఫ్ సెంచరీకి చేరువలో చేతులేత్తేశాడు. దాంతో, ఐపీఎల్ మ్యాచ్‌లో వరుసగా రెండోసారి చెన్నై ఓడిపోయింది.

మిగతా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా (31), అజింక్య రహానె (35), డారిల్ మిచెల్ (13), రచిన్ రవీంద్ర (12) పరుగులకే పరిమితమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, షాట్ కమిన్స్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్ తలో వికెట్ పడగొట్టారు.

Read Also : IPL 2024: క్రికెట్ పిచ్చికి నిద‌ర్శ‌నం.. దిండు, దుప్ప‌టితో దిగేశారుగా..

ట్రెండింగ్ వార్తలు