Courtesy BCCI
పంజాబ్ కింగ్స్ పై వీర విహారం చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గెలిపించాడు అభిషేక్ శర్మ. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న అతడు 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 141 పరుగులు చేశాడు.
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో అభిషేక్‌కు రెండు సార్లు అదృష్టం కలిసి వచ్చింది. ఓ సారి క్యాచ్ ఔట్ అయినా నోబాల్ కావడంతో బతికిపోయాడు. మరోసారి స్పిన్నర్ చాహల్ క్యాచ్ మిస్ చేయడంతో సెంచరీతో చెలరేగాడు.
ఆ ‘no బాల్’ వేయకుంటే..
సన్ రైజర్స్ ఇన్నింగ్స్ 4 ఓవర్‌ను యశ్ ఠాకూర్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని ఫోర్‌గా మలిచిన అభిషేక్ మూడో బంతికి సిక్స్ బాదాడు. అదే ఊపులో నాలుగో బంతికి భారీ షాట్ కొట్టాడు. అయితే.. బౌండరీ లైన్ వద్ద శశాంక్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. దీంతో పంజాబ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.
A wicket on the no ball.
Abhishek Sharma makes it out with a six on the free hit. 🌟pic.twitter.com/Stj4yPcU25
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2025
అప్పుడు అంపైర్ పంజాబ్‌కు షాకిచ్చాడు. ఠాకూర్ నోబాల్ వేశాడని చెప్పాడు. దీంతో అభిషేక్ బతికిపోయాడు. అప్పటికి అభిషేక్ స్కోరు 28 పరుగులు మాత్రమే. నోబాల్ కావడంతో తరువాతి బంతి ఫ్రీహిట్‌ను సిక్స్‌గా మలిచాడు అభిషేక్. ఇదే ఊపులో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
చాహల్ క్యాచ్ మిస్..
హాఫ్ సెంచరీ బాది మంచి ఊపుమీదున్న అభిషేక్. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌ను చాహల్ వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతికి అభిషేక్ భారీ షాట్ ఆడగా.. మిస్ టైమ్ కావడంతో బంతి చాలా ఎత్తున గాల్లోకి లేచింది. మిడ్ వికెట్ వద్ద ఎవరూ ఫీల్డర్లు లేరు. బౌలర్ చాహల్.. వెనక్కి వెలుతూ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికి బాల్ అతడి చేతుల్లో ఆగలేదు. దీంతో అభిషేక్ కు మరోసారి లైఫ్ వచ్చింది. అప్పటికి అభిషేక్ స్కోరు 56 పరుగులు మాత్రమే.
Chahal Dropped the Catch of Abhishek Sharma on 56 Runs. pic.twitter.com/ABUCVwEnOO
— VIKAS (@VikasYadav69014) April 12, 2025
ఈ రెండు అవకాశాలను అభిషేక్ శర్మ సద్వినియోగం చేసుకున్నాడు. మరోసారి పంజాబ్‌కు అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. భారీ శతకాన్ని సాదించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
ఆ బంతి నోబాల్ కాకున్నా, లేదంటే చాహల్ క్యాచ్ అందుకున్నా మ్యాచ్ మరోరకంగా ఉండేది పంజాబ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (82; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (42; 23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), మార్క్ స్టోయినిస్ (34 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు.
అనంతరం అభిషేక్ శర్మ (141; 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకానికి తోడు ట్రావిస్ హెడ్ (66; 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడు కావడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది.