Abhishek Sharma : అభిషేక్ శర్మ కన్నా ముందు ఇలా పేపర్ మీద రాసింది ఎవరో తెలుసా? దిగ్గజ క్రికెటర్‌కు కౌంటర్ ఇచ్చాడు అప్పట్లో..
అభిషేక్ చేసుకున్న విధంగా గతంలో ఎవరైనా సెంచరీ చేసిన తరువాత పేపర్ తీసి సంబరాలు చేసుకున్నారా? అని సందేహం క్రికెట్ అభిమానుల్లో ఉంది.

Abhishek Sharma kanna mundu ila paper meeda rasindi evaro Telusa
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. మొత్తంగా అభిషేక్ 55 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 141 పరుగులు చేశాడు.
కాగా.. ఈ మ్యాచ్‌లో సెంచరీ అనంతరం అతడు వినూత్న రీతిలో సంబరాలు చేసుకున్నాడు. తన జేబులోంచి ఒక కాగితాన్ని తీసి అభిమానులకు చూపించాడు. దానిపై ‘‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా.. క్రికెట్‌లో ఆటగాళ్లు సెంచరీ చేసిన అనంతరం ఒక్కొక్కరు ఒక్కొ రీతీలో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అభిషేక్ చేసుకున్న విధంగా గతంలో ఎవరైనా సెంచరీ చేసిన తరువాత పేపర్ తీసి సంబరాలు చేసుకున్నారా? అని సందేహం క్రికెట్ అభిమానుల్లో ఉంది.
దాదాపు 12 ఏళ్ల క్రితమే వెస్టిండీస్ ఆటగాడు దినేష్ రామ్‌దిన్ ఈ విధంగా సంబురాలు చేసుకున్నాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో అతడు సెంచరీ చేసిన తరువాత జేబులోంచి ఓ పేపర్ తీసి దాన్ని అందరికి చూపించాడు. అయితే.. దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ విమర్శిస్తున్నట్లుగా అందులో రాసి ఉంది. ఈ పని చేసినందుకు రామ్‌దిన్‌కు ఐసీసీ జరిమానా విధించింది.
Abhishek Sharma : విధ్వంసకర సెంచరీ తరువాత అభిషేక్ శర్మ కామెంట్స్.. వారి వల్లే ఈ శతకం..
అసలేం జరిగిందంటే..?
2012లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో వెస్టిండీస్ ఆటగాడు దినేష్ రామ్‌దిన్ పేలవ ఫామ్‌లో ఇబ్బంది పడ్డాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు మ్యాచ్ ముగిసిన తరువాత రామ్‌దిన్ ఆటతీరుపై విండీస్ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ మాట్లాడాడు. అతడి ఆటతీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
కట్ చేస్తే.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు సెంచరీ చేశాడు రామ్‌దిన్. వెంటనే తన జేబులోంచి ఓ పేపర్ తీసి స్టాండ్స్ వైపుగా చూపించాడు. ఆ కాగితంపై ‘యే వివ్ టాక్ నాహ్’ అని రాసి ఉంది. దీన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. రిచర్డ్స్ అన్న మాటలను మనసులో పెట్టుకున్న రామ్‌దిన్ సెంచరీ అనంతరం కావాలనే ఇలా చేశాడని అందరూ అతడిని విమర్శించాడు. అప్పట్లో ఇది తీవ్ర దుమారం రేపింది.
రామ్‌దిన్ చేసిన పనిపై ఐసీసీ మండిపడింది. ఇది ఆట స్ఫూర్తికి విరుద్దం అని తెలిపింది. ఈ పని చేసినందుకు గాను రామ్‌దిన్ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. ఈ సంఘటన నుంచి రామ్‌దిన్ పాఠం నేర్చుకున్నాడని భావిస్తున్నామని, అతడు తప్పుఒప్పుకున్నాడని, భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరూ కూడా ఇలా ప్రవర్తించబోరని ఆశిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.