SRH vs PBKS : అభిషేక్ ‘చిట్టీ’ గుట్టు విప్పిన ట్రావిస్ హెడ్‌.. ఎన్ని రోజుల నుంచి జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడంటే..?

సెంచ‌రీ సాధించిన త‌రువాత అభిషేక్ శ‌ర్మ వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు.

SRH vs PBKS : అభిషేక్ ‘చిట్టీ’ గుట్టు విప్పిన ట్రావిస్ హెడ్‌.. ఎన్ని రోజుల నుంచి జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడంటే..?

Updated On : April 13, 2025 / 8:44 AM IST

శ‌నివారం రాత్రి ఉప్ప‌ల్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ విధ్వంసం సృష్టించాడు. ఎడా పెడా బౌండ‌రీల వ‌ర్షం కురిపించిన ఈ ఎడ‌మ చేతి వాటం ఆట‌గాడు పంజాబ్ బౌలింగ్‌ను ఊచ‌కోత కోశాడు. కేవ‌లం 40 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న అత‌డు 14 ఫోర్లు, 10 సిక్స‌ర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు.

ఇక సెంచ‌రీ సాధించిన త‌రువాత అభిషేక్ శ‌ర్మ వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. త‌న జేబులోంచి ఓ కాగితం ముక్క తీసి దాన్ని.. చుట్టూ తిరుగుతూ అంద‌రికి చూపించాడు. ఆ కాగితంలో ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అని రాసి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అంద‌రూ కూడా ఎస్ఆర్‌హెచ్ వ‌రుస‌గా మ్యాచ్‌లు ఓడిపోతుండ‌డంతో ఈ మ్యాచ్‌కు ముందు చిట్టీ రాసుకుని వ‌చ్చాడ‌ని అనుకున్నారు. కానీ అస‌లు నిజాన్ని మాత్రం అత‌డి స‌హ‌చ‌రుడు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రో ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ చెప్పాడు. ఆ చిట్టీ అత‌డి జేబులో గ‌త 6 మ్యాచ్‌లుగా ఉంద‌న్నాడు. దేవుడి ద‌య వ‌ల్ల పంజాబ్‌తో మ్యాచ్ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్నాడు.

అంటే.. ఐపీఎల్ ప్రారంభం ముందే అభిషేక్ శ‌ర్మ చిట్టీ రాసుకుని జేబులో ఉంచుకున్నాడు. అయితే.. గ‌త 5 మ్యాచ్‌ల్లో అత‌డు స‌రైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. పంజాబ్‌తో మ్యాచ్‌లో సెంచ‌రీ చేయ‌డంతో చిట్టీని బ‌య‌ట‌కు తీశాడ‌న్న‌మాట‌.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత‌ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 245 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (82; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (42; 23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), మార్క్ స్టోయినిస్ (34 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) దంచికొట్టారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ నాలుగు వికెట్లు తీశాడు. ఎషాన్ మలింగ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.


అనంత‌రం అభిషేక్ శ‌ర్మ (141; 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స‌ర్లు) విధ్వంస‌కర శ‌త‌కానికి తోడు ట్రావిస్ హెడ్ (66; 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపులు తోడు కావ‌డంతో ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 18.3 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది.