Abhishek Sharma : విధ్వంసకర సెంచరీ తరువాత అభిషేక్ శర్మ కామెంట్స్.. వారి వల్లే ఈ శతకం..
పంజాబ్ కింగ్స్ పై శతకంతో చెలరేగిన హైదరాబాద్ ఓపెనర్ అబిషేక్ శర్మ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ పై స్పందించాడు.

Courtesy BCCI
ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ శివాలెత్తాడు. సిక్సర్లు, ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న అతడు 14 ఫోర్లు, 10 సిక్సర్ల బాది 141 పరుగులు చేశాడు. అభిషేక్ వీర విజృంభణకు తోడు ట్రావిస్ హెడ్ (66; 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ జత కావడంతో 246 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో అందుకుంది. ఐపీఎల్‌లో ఇది రెండో అత్యధిక ఛేదన కావడం గమనార్హం.
హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ పాట్ కమిన్స్ అండతోనే తాను రాణించానని మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ తెలిపాడు. తన తల్లితండ్రుల సమక్షంలో సెంచరీ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ కమిన్స్‌తో పాటు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు ధన్యవాదాలు తెలియజేశాడు.
‘ట్రావిస్ హెడ్‌తో పాటు నాకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్‌కు కృతజ్ఞతలు. ఫామ్‌లో లేకపోయినా అండగా నిలిచారు. డ్రెస్సింగ్ రూమ్‌లో గొప్ప వాతావరణం ఉంది. వికెట్ పై కొంచెం బౌన్స్ ఉండడంతో ఈజీగా ఆడేలా కొన్ని కొత్త షాట్లను కొట్టే ప్రయత్నం చేశాను. పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంది.’ అని అభిషేక్ శర్మ అన్నాడు.
ఇక తల్లితండ్రుల సమక్షంలో సెంచరీ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ‘నా తల్లితండ్రుల కోసం సన్‌రైజర్స్ టీమ్ మొత్తం ఎంతో కాలంగా ఎదురుచూసింది. వారు రావడం మాకు కలిసి వచ్చింది. ఓవర్ల మధ్యలో నేను, ట్రావిస్ హెడ్ ఏమీ మాట్లాడుకోలేదు. మా సహజమైన ఆట ఆడేందుకు ప్రయత్నించాం. ఇక తొలి వికెట్ భాగస్వామ్యం ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ సెంచరీ నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే వరుస ఓటములకు బ్రేక్ వేయాలని అనుకున్నాను. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడంతో యువ ఆటగాడిగా కష్టంగా అనిపించింది.’ అని అభిషేక్ చెప్పాడు.
తన మెంటార్ యువీ గురించి ప్రత్యేకంగా చెప్పాలన్నాడు. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్‌లు తనతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారన్నాడు. మద్దతుగా ఉన్నారని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(82; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), మార్కస్ స్టాయినిస్ (34 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) దంచికొట్టారు. అనంతరం లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు అందుకుంది.