SRH vs PBKS : మ్యాచ్ మధ్యలో గొడవ పడ్డ మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్.. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ ల మధ్య గొడవ జరిగింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ పంజా విసిరింది. వరుస ఓటములకు బ్రేక్ వేస్తూ సొంత గడ్డపై విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (82; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (42; 23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), మార్క్ స్టోయినిస్ (34 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) దంచికొట్టారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీశాడు. ఎషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం అభిషేక్ శర్మ (141; 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకానికి తోడు ట్రావిస్ హెడ్ (66; 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడు కావడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది.
గొడవ పడ్డ ట్రావిస్ హెడ్..
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ ల మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఒకరితో ఒకరు మాటల యుద్ధానికి దిగారు. ఈ ఘటన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో చోటు చేసుకుంది.
Heat moment between Glenn Maxwell and Travis Head.
📸: @StarSportsIndia | #SRHvPBKS pic.twitter.com/bjPnOPyhms
— CricAsh (@ash_cric) April 12, 2025
తొమ్మిదో ఓవర్‌ను మాక్స్‌వెల్ వేయగా.. మూడు, నాలుగు బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు హెడ్. ఐదో బంతిని కొట్టగా.. మాక్స్‌వెల్ దిశగా బంతి వెళ్లింది. వెంటనే అతడు బంతిని అందుకుని వికెట్ కీపర్ దిశగా వేశాడు. ఇది నచ్చని ట్రావిస్ హెడ్ కాస్త సీరియస్‌గా మాక్స్‌వెల్‌ను చూశాడు. ఇక ఆరో బంతి డాట్ అయింది.
ఓవర్ పూర్తి కావడంతో మాక్సీని హెడ్ ఎంతో అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మార్కస్ స్టోయినిస్‌తో పాటు అంపైర్‌లు మధ్యలో కలగజేసుకుని ఇద్దరికి సర్దిచెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.