IPL 2025: సచిన్, రోహిత్, విరాట్ చేయలేనిది సాయి సుదర్శన్ సాధించాడు.. ఐపీఎల్‌లో అలా చేసిన మొదటి భారతీయుడు అతనే

ఐపీఎల్ - 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయాల్లో సాయి సుదర్శన్ కీలక భూమిక పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును నమోదు చేశారు.

Sai Sudarshan

IPL 2025: ఐపీఎల్-2025 సీజన్ లో భాగంగా బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేయగా.. సాయి సుదర్శన్ (82 పరుగులు 53 బంతుల్లో) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో గుజరాత్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.

Also Read: IPL 2025 : తిరుగులేని గుజరాత్.. వరుసగా నాలుగో విజయం..

ఐపీఎల్ -2025 సీజన్లో గుజరాత్ జట్టు విజయాల్లో సాయి సుదర్శన్ పాత్ర కీలకం. ఆ జట్టు ఆడిన ఐదు మ్యాచ్ లలో సాయి సుదర్శన్ 74, 63, 49, 5, 82 పరుగులు చేశాడు. నిలకడైన ఆటతో పరుగులు రాబడుతున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ప్రస్తుతం అతడు రెండో స్థానంలో ఉన్నాడు. సుదర్శన్ ఇప్పటి వరకు 54.60 సగటు, 151.66 స్ట్రైక్ రేట్ తో 273 పరుగులు చేశాడు.

 

మరోవైపు గుజరాత్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్లు సచిన్, రోహిత్, విరాట్ కోహ్లీలు సాధించలేని ఫీట్ ను సాయి సుదర్శన్ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మైదానంలో వరుసగా ఐదు అర్థ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా సాయి సుదర్శన్ నిలిచాడు. అతనికంటే ముందు ఏబీ డివిలియర్స్ మాత్రమే దీన్ని చేయగలిగాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సాయి సుదర్శన్ 32బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేయడం ద్వారా ఈ రికార్డును సాధించాడు.

Also Read: CSK Playoffs Scenario : వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల్లో ఓట‌మి.. చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఛాన్సుందా? ఇంకా ఎన్ని మ్యాచ్‌ల్లో గెల‌వాలంటే..?

సాయి సుదర్శన్ ఇప్పటి వరకు ఐపీఎల్ -2025లో ఐదు మ్యాచ్ లలో 273 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు హాఫ్ సెంచరీలు కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చేశాడు. అదే సమయంలో గత సీజన్ లో అంటే.. ఐపీఎల్ -2024లో అహ్మదాబాద్ లో ఆడిన చివరి రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సుదర్శన్ ఆఫ్ సెంచరీలు చేశాడు. తద్వారా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్ మెన్ గా సుదర్శన్ నిలిచాడు.

 

దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ 2018, 2019 ఐపీఎల్ సీజన్ లలో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా అతను చరిత్ర సృష్టించాడు. ఈ రెండు సీజన్లలోనూ డివిలియర్స్ ఆర్సీబీ తరపున ఆడాడు.