IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన ఐదుగురు కీలక ఆటగాళ్లు వీరే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. ఈనెల 31న సాయంత్రం తొలి మ్యాచ్ జరగనుండగా.. మే 28న ఫైల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఈ సీజన్‌కు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమవుతున్నారు. వారిలో ఐదుగురు గురించి తెలుసుకుందాం.

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. మార్చి 31న సాయంత్రం మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. 16వ సీజన్ ఐపీఎల్ ట్రోపీని దక్కించుకొనేందుకు పది టీంలు సిద్ధమయ్యాయి. అయితే కొన్ని జట్లను ప్రధాన ఆటగాళ్లు గాయాల భారిన పడటం ఆందోళనకు గురిచేస్తుంది. ఆయా జట్లలో కీలక ప్లేయర్లు టోర్నీ నుంచి తప్పుకోవాల్సి రావటం జట్టు విజయాలపై ప్రభావం చూపుతుందని ప్రాచైంజీలు ఆందోళన చెందుతున్నారు. గాయం కారణంగా టోర్నీకి దూరమైన ఐదుగురు కీలక ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..

రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్)

Rishabh Pant

టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా ఈసారి జరిగే ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. పంత్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. పంత్ గౌర్హాజరుతో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే, పంత్ జట్టులో లేకపోవటం ఆ జట్టుకు ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు.

జస్క్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్)

Jasprit Bumrahm

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా 16వ సీజన్ ఐపీఎల్ టోర్నమెంట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన బుమ్రా.. జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తాడు. అయితే, బుమ్రా వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

జానీ బెయిర్ స్టో ( పంజాబ్ కిగ్స్)

jonny Bairstow

టీ20 ఫార్మాట్‌లో విధ్వంసకర బ్యాటర్‌గా జానీ బెయిర్ స్టో పేరుగడించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కిగ్స్ జట్టు తరపున అతడు ఆడాల్సి ఉంది. అతని కాలుకు తీవ్రగాయం కావటంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం జానీ బెయిర్ స్టో దూరమయ్యాడు. అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ మ్యాట్ షార్ట్ ను ఎంపిక చేసింది.

శ్రేయాస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్)

Shreyas Iyer

టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అర్ధాంతరంగా మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఐపీఎల్ టోర్నీలో సైతం శ్రేయాస్ అయ్యర్ ఆడే అవకాశం కోల్పోయాడు. కోల్‌కతా జట్టుకు అతను కెప్టెన్ గా వ్యవహరించాడు. శ్రేయాస్ ఈ సీజన్ ఐపీఎల్‌కు పూర్తిగా దూరంకావడంతో అతని స్థానంలో కేకేఆర్ జట్టు స్టార్ బ్యాటర్ నితీష్ రానాను కెప్టెన్ గా నియమించింది.

కైల్ జేమీసన్ (చెన్నై సూపర్ కింగ్స్)

Kyle Jamieson

కైల్ జేమీసన్ న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. మినీ వేలం సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం జేమీసన్‌ను మినీ వేలంలో కొనుగోలు చేసింది. అయితే, జేమీసన్ శస్త్రచికిత్స చేయించుకోనున్న నేపథ్యంలో నాలుగు నెలలు పాటు క్రికెట్ కు దూరం కానున్నాడు. దీంతో ఈ సీజన్ ఐపీఎల్‌కు జేమీసన్ పూర్తిగా దూరమయ్యాడు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ సిసంద మగలాను సీఎఎస్‌కే జట్టులోకి తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు